- ఆయన చరిత్రను దేశ యువత తెలుసుకోవాలి: ప్రధాని మోదీ
- 40 ఏండ్లే బతికినా.. ప్రజలపై చెరగని ముద్ర వేశారు
- జీఎస్టీ మార్పులతో సామాన్యుల ఇంట పండుగ
- ఛఠ్ పండుగ సాంస్కృతిక, సామాజిక ఐక్యతకు ప్రతీక
- కోరాపుట్ కాఫీకి ప్రపంచవ్యాప్త గుర్తింపని వెల్లడి
- మన్‌కీబాత్ 127వ ఎపిసోడ్ ప్రసారం
న్యూఢిల్లీ: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ పోరాట యోధుడు కుమ్రం భీం ఉద్యమించారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన చరిత్రను తెలుసుకోవాలని దేశ యువతకు సూచించారు. కుమ్రం భీం జయంతిని ఈ నెల 22న నిర్వహించారని చెప్పారు. ఆయనకు నివాళి అర్పించారు. మన్ కీ బాత్ 127వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ మాట్లాడారు. భారత్‌ను దోచుకునేందుకు బ్రిటీషర్లు అన్ని మార్గాలను వాడారని తెలిపారు. ఆ సమయంలో దక్షిణాదిన నిజాం పాలనను బలపరిస్తే.. హైదరాబాద్ ప్రజల ప్రతిస్పందన వీరోచితంగా ఉందని అన్నారు. పేదలు, గిరిజనులపై నిజాం పాలకుల అరాచకాలు ఎక్కువైపోయినప్పుడు.. వారికి వ్యతిరేకంగా కుమ్రం భీం ఎదురొడ్డి పోరాడారని గుర్తుచేశారు. 20 ఏండ్ల వయస్సులోనే నిజాం అధికారి సిద్ధిఖీని బహిరంగంగానే సవాల్ చేశాడని, అతడిని మట్టుబెట్టి అస్సాం చేరుకున్నాడని తెలిపారు. కేవలం 40 ఏండ్లే బతికినా.. ప్రజలపై కుమ్రం భీం చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. 1940లో నిజాం సైనికులు ఆయన్ను హత్య చేశారని తెలిపారు. ఛత్ పండుగను సాంస్కృతిక, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నదని చెప్పారు. ఈ పండుగను బిహార్, జార్ఖండ్, పూర్వాంచల్ ప్రాంతాల్లో ఎక్కువగా జరుపుకుంటారని, సమాజంలోని అన్ని వర్గాలు ఛత్ ఘాట్‌ల వద్ద ఒక్కటవడం దేశ ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్.. ప్రతి భారతీయుడు గర్వించేలా చేసిందని, మావోయిస్టు టెర్రర్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఈసారి దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారని తెలిపారు.
స్వదేశీ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగినయ్
జీఎస్టీలో మార్పులు ఈసారి పండుగ సీజన్‌లో సామాన్యుడి ఇంట్లో సంతోషాన్ని నింపాయని ప్రధాని మోదీ అన్నారు. స్వదేశీ ఉత్పత్తుల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని చెప్పారు. వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలన్న తన లేఖకు ప్రజలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. చత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్‌లో గార్బేజ్ కేఫ్ పర్యావరణ పరిరక్షణకు సరికొత్త ఐడియాతో ముందుకొచ్చిందని తెలిపారు. అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలకు బదులుగా ఫుల్ మీల్స్, టిఫిన్ ఇస్తున్నారని, దీన్ని అంబికాపుర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్నదని చెప్పారు. గుజరాత్‌లోని ధోలేరా తీరంలో మంగ్రూవ్ (ఉష్ణమండల మొక్కలు) నాటడం వల్ల డాల్ఫిన్లు, పీతలు, జలచరాల సంఖ్య పెరిగిందని, వలస పక్షులు కూడా ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. కచ్‌లోని కోరీ క్రీక్‌లో ‘మంగ్రూవ్ లెర్నింగ్ సెంటర్’ ఏర్పాటైందని, ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని కోరారు. బెంగళూరులో కపిల్ శర్మ అనే వ్యక్తి చెరువులకు జీవం పోసేందుకు నడుం బిగించారని, ఆయన బృందం ఇప్పటివరకూ 40 బావులు, 6 చెరువులను పునరుద్ధరించిందని చెప్పారు.
కోరాఫుట్ కాఫీతో జీవనోపాధి
బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్‌లలో ఇండియా బ్రీడ్ కుక్కలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, రాంపూర్ హౌండ్, ముధోల్ హౌండ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఈ నెల 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో ‘ఏక్తా దివాస్ పరేడ్’ జరుగుతుందని, స్వదేశీ కుక్కల సామర్థ్యాలు ఇక్కడ ప్రదర్శిస్తారని తెలిపారు. సర్దార్ పటేల్ దేశ ఐక్యతకు, బ్యూరోక్రాటిక్ వ్యవస్థకు బలమైన పునాది వేశారని, ‘రన్ ఫర్ యూనిటీ’లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఒడిశాలోని కోరాపుట్ కాఫీ.. అద్భుతమైన రుచితో స్థానికులకు జీవనోపాధి కల్పిస్తున్నదని తెలిపారు. కర్నాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ కాఫీ సాగు పెరుగుతూ, భారతీయ కాఫీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని చెప్పారు. వందేమాతరం.. దేశభక్తిని ప్రేరేపించే గేయమని, బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ గేయం 150వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో #VandeMatram150 ద్వారా సూచనలు పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కొంతమంది యువత సోషల్ మీడియా ద్వారా సంస్కృత భాషకు జీవం పోస్తున్నారని అభినందించారు. యశ్ సాలుంకే, కమల, జాన్హవిలాంటి యువత సంస్కృతంలో ఆసక్తికర కంటెంట్ సృష్టిస్తున్నారని చెప్పారు. భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా వచ్చే నెల 15న ‘జన జాతీయ గౌరవ్ దివస్’ జరుపుకుంటారని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం, గిరిజనుల హక్కుల కోసం ఆయన అసమాన కృషి చేశారని మోదీ కొనియాడారు.
