
సాబర్ కాంఠా(గుజరాత్): దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో డెయిరీ సెక్టార్దే కీలక పాత్ర అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రూరల్ ఎకానమీకి ఊతం అందించేందుకు రైతులు, పాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. గుజరాత్ లోని సాబర్ కాంఠా జిల్లాలో సాబర్ డెయిరీ విస్తరణలో భాగంగా మిల్క్ పౌడర్ ప్లాంట్, పలు ఇతర ప్రాజెక్టులను మోడీ గురువారం ప్రారంభించి మాట్లాడారు. మిల్క్ పౌడర్ ప్లాంట్‌తో సాబర్ డెయిరీ బిజినెస్ మరింతగా పెరుగుతుందన్నారు. గుజరాత్లో డెయిరీ మార్కెట్ విస్తరించిందని, ప్రస్తుతం రాష్ట్రంలో మార్కెట్ విలువ రూ. లక్ష కోట్లకు చేరిందన్నారు. సాబర్ డెయిరీలో టెక్నాలజీతో కూడిన ప్రాజెక్టులను ప్రారంభించడంతో రూరల్ ఎకానమీకి మేలు జరుగుతుందని, పాడి రైతులకు మద్దతు లభిస్తుందని ప్రధాని చెప్పారు. డెయిరీ సెక్టార్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందన్నారు. దేశవ్యాప్తంగా 10 వేల ఫార్మర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్స్ ఏర్పాటు అవుతున్నాయని, రైతుల ఇన్ కం పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు.
రాష్ట్రపతిగా ముర్ము దేశానికే గర్వకారణం
ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవడం 130 కోట్ల మంది ఇండియన్లకే గర్వకారణమని ప్రధాని మోడీ అన్నారు. ‘‘దేశ చరిత్రలో తొలిసారిగా ఒక ఆదివాసీ బిడ్డ అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టారు. యావత్తు దేశం ఆమెను రాష్ట్రపతిగా ఎన్నుకుంది’’ అని చెప్పారు. ముర్మును రాష్ట్రపత్ని అంటూ కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చేసిన కామెంట్లు దుమారం రేపడంతో ప్రధాని ఈ మేరకు పరోక్షంగా ప్రస్తావించారు.