స్వచ్ఛతా హీ సేవలో పాల్గొనండి.. మన్ కీ బాత్​లో ప్రధాని పిలుపు

స్వచ్ఛతా హీ సేవలో పాల్గొనండి.. మన్ కీ బాత్​లో ప్రధాని పిలుపు
  • ‘స్వచ్ఛతా హీ సేవ’లో పాల్గొనండి
  • మన్ కీ బాత్​లో ప్రధాని పిలుపు

న్యూఢిల్లీ : ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 సమిట్​లో ప్రతిపాదించిన ఇండియా– మిడిల్ ఈస్ట్–యూరప్ కారిడార్ భవిష్యత్తులో వందల ఏండ్లపాటు ప్రపంచ వాణిజ్యానికి ఆధారంలా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం తన 108వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. చంద్రయాన్–3 సక్సెస్ తర్వాత జీ20 సమిట్ కూడా విజయవంతం కావడంతో దేశంలోని ప్రతి ఒక్కరి సంతోషం రెట్టింపు అయిందన్నారు. 

జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్​ను చేర్చుకోవడం ద్వారా ఇండియా నాయకత్వాన్ని ప్రపంచం అంగీకరించినట్లు అయిందన్నారు. గాంధీ జయంతికి ఒకరోజు ముందు అక్టోబర్ 1న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించే ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే మహాత్ముడికి నిజమైన నివాళి అని అన్నారు. గాంధీ జయంతి రోజున ఖాదీ ఉత్పత్తులను కూడా కొనాలని కోరారు. 

మేడ్ ఇన్ ఇండియా వస్తువులను కొనడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ నినాదానికి మద్దతివ్వాలన్నారు. మన దేశ సంస్కృతి, సంగీతాలకు ప్రపంచ గుర్తింపు దక్కుతోందని ప్రధాని మోదీ చెప్పారు. ఉత్తరాఖండ్​లోని నైనిటాల్​లో యువత ‘ఘోడా లైబ్రరీ (గుర్రంపై గ్రంథాలయం)’ ద్వారా గ్రామీణ చిన్నారులకు పుస్తకాలను చేరవేస్తుండటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

హైదరాబాద్ బాలికకు ప్రశంసలు  

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్​లో 7వ క్లాస్ చదువుతున్న 11 ఏండ్ల ఆకర్షణ సతీశ్ అనే బాలిక ను కూడా ప్రధాని మోదీ మెచ్చుకున్నా రు. పుస్తక పఠనం పై ఆసక్తి ఉన్న ఆమె తన తండ్రి సహకారంతో పిల్లల కోసం ఏడు లైబ్రరీలను నిర్వహిస్తోందని అభినందిం చారు. తోటి పిల్లల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేలా చిన్న వయసులోనే విశేష కృషి చేస్తున్న ఆకర్షణ గతంలో రాష్ట్రపతి నుంచి కూడా ప్రశంసలు అందుకున్నది.