
- 45 ఏండ్ల తర్వాత ఆ దేశంలో అడుగుపెట్టిన భారత ప్రధాని
- రేపు పోలెండ్ నుంచి ఉక్రెయిన్‌కు రైల్లో ప్రయాణం
- ఉక్రెయిన్‌కు వెళ్తున్న మొదటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా మోదీనే
- రేపు ఉక్రెయిన్‌కు వెళ్లనున్న ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పోలెండ్, ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. బుధవారం ఆయన ప్రత్యేక విమానంలో పోలెండ్ రాజధాని వార్సా చేరుకున్నారు. అక్కడ రెండ్రోజుల పర్యటన తర్వాత.. శుక్రవారం ఉక్రెయిన్ వెళ్తారు. గత 45 ఏండ్ల తర్వాత పోలెండ్‌కు వెళ్లిన భారత ప్రధాని మోదీనే. చివరిసారి 1979లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆ దేశానికి వెళ్లారు. పోలెండ్, ఉక్రెయిన్ దేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తన పర్యటన ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. టూర్ కు వెళ్లేముందు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
సెంట్రల్ యూరప్‌లో భారత్‌కు పోలెండ్ కీలకమైన ఆర్థిక భాగస్వామి. భారత్, పోలెండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏండ్లయిన సందర్భంగా అక్కడికి వెళ్తున్నాను. ఆ దేశ ప్రెసిడెంట్ ఆండ్రెజ్ దుడా, ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నాను. పోలెండ్‌లోని ఇండియన్స్ తోనూ సమావేశం కానున్నాను” అని మోదీ పేర్కొన్నారు.
అక్కడి నుంచి రైల్లో ఉక్రెయిన్‌కు..
ప్రధాని మోదీ శుక్రవారం పోలెండ్ నుంచి ఉక్రెయిన్ వెళ్తారు. దాదాపు 10 గంటలు రైల్లో ప్రయాణం చేసి ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకుంటారు. ఉక్రెయిన్ కు వెళ్తున్న మొదటి భారత ప్రధాని మోదీనే. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నట్టు మోదీ తెలిపారు.