వెల్ కమ్.. మోదీజీ

వెల్ కమ్.. మోదీజీ

న్యూయార్క్: ఈ నెల 20న ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఇండియన్ – అమెరికన్ల నుంచి వెల్ కమ్ విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు స్వాగతం పలుకుతూ ఎన్​ఆర్​ఐలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మోదీ స్ఫూర్తివంతమైన నాయకుడు అని, అందుకు తామెంతో గర్వపడుతున్నామని ప్రశంసలు కురిపిస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ ప్రాంతాల నుంచి వచ్చిన స్పెషల్ వీడియో మెసేజ్ లను న్యూయార్క్ లోని ఇండియన్ కాన్సులేట్ ఆఫీస్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, నయాగరా ఫాల్స్, ప్రిన్స్​టన్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, కొలంబియా బిజినెస్ స్కూల్, నేషనల్ మ్యూజియం ఆఫ్ ది యూఎస్ ఎయిర్ ఫోర్స్, టైమ్స్ స్క్వేర్, బ్రూక్లిన్ బ్రిడ్జి తదితర ప్రాంతాల నుంచి ఇండియన్ అమెరికన్లు పోస్టుచేసిన మెసేజ్​లను ట్వీట్ చేసింది. ‘‘మోదీ విజిట్ చరిత్రాత్మకమైనది. బ్యూటీఫుల్ సిటీకి ఆయనకు వెల్ కమ్ చెబుతున్నం” అని ఎన్ఆర్ఐలు పోస్టులు పెట్టారు. 

యూఎస్ లీడర్ల నుంచి.. 

అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లీడర్లు కూడా మోదీకి వెల్ కమ్ చెబుతూ సోషల్ మీడియాలో మెసేజ్ లు పెట్టారు. ‘‘నమస్తే.. ప్రధాని మోదీ విజిట్ ఒక ముఖ్యమైన సందర్భం. అమెరికా, ఇండియా మధ్య బంధాల బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుంది. 2019లో నేను ఇండియాకు వెళ్లాను. అప్పుడు అక్షర్ ధామ్ టెంపుల్, జామా మసీద్, గోల్డెన్ టెంపుల్ తదితర ప్రదేశాలను చూశాను. ఇప్పుడు మోదీ కూడా ఇక్కడి అందాలను వీక్షించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను” అని న్యూజెర్సీకి చెందిన సెనేటర్ బాబ్ మెనెండెజ్ ట్వీట్ చేశారు.

‘‘ఇండియా, అమెరికా మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి మోదీ విజిట్ ఉపయోగపడుతుంది” అని డెలావేర్ గవర్నర్ జాన్ కార్నీ వీడియో మెసేజ్ లో పేర్కొన్నారు. కాగా, ఈ నెల 20న మోదీ న్యూయార్క్ వెళ్లనున్నారు. 21న యునైటెడ్ నేషన్స్ లో ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొంటారు. 22న వాషింగ్టన్ డీసీకి వెళ్తారు. అక్కడ ఆయనకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ స్వాగతం పలుకుతారు. మోదీ అమెరికా కాంగ్రెస్ జాయింట్ సెషన్ లో మాట్లాడి.. బైడెన్ ఇచ్చే విందుకు హాజరవుతారు.