కష్టపడితే అధికారం మనదే

కష్టపడితే అధికారం మనదే

న్యూఢిల్లీ, వెలుగు :  కష్టపడి పని చేస్తే తెలంగాణలో బీజేపీదే అధికారమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే ఎన్నికల కోసం బాగా పనిచేయాలని జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లకు ఆయన సూచించారు. కార్పొరేటర్లు బాగా పనిచేస్తే ప్రజలు బీజేపీతో ఉంటారని మోడీ చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆదర్శంగా ఉండాలని అన్నారు. ప్రజలతో మమేకం కావాలని, వారి కష్టాసుఖాలను పంచుకుని తామున్నామనే భరోసా ఇవ్వాలని సూచించారు.  మంగళవారం పార్టీకి చెందిన 47 మంది జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని మోడీ ఢిల్లీలోని లోక్​కల్యాణ్​ మార్గ్​లోని తన ఇంట్లో దాదాపు గంటన్నరపాటు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్​, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​ తదితరులు పాల్గొన్నారు. ఒక్కో కార్పొరేటర్​తో వ్యక్తిగతంగా మాట్లాడిన మోడీ.. అందరి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ వివరాలు, పిల్లల బాగోగులపై ఆరా తీసిన ఆయన.. కార్పొరేటర్​గా గెలవడంతోనే రాజకీయ జీవితం పూర్తి కాలేదని, ప్రజలకు మరింత చేరువ కావాలని వారికి సూచించారు. అంచెలంచెలుగా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జూన్​ 2, 3 తేదీల్లో బీజేపీ నేషనల్​ ఎగ్జిక్యూటివ్​ మీటింగ్​ కోసం హైదరాబాద్​కు వస్తానని, అప్పుడు మరిన్ని అంశాలు, ప్రజా సమస్యలపై చర్చిద్దామని కార్పొరేటర్లకు మోడీ చెప్పారు. 
టైం ఇవ్వడం గొప్ప విషయం 
ప్రధానిని కలవడం గర్వంగా ఉంది. సీఎం కేసీఆర్​.. మంత్రులు, ఎమ్మెల్యేలకే సమయం ఇవ్వడం లేదు. కానీ, దేశ ప్రధాని కార్పొరేటర్లకు టైం ఇవ్వడం గొప్ప విషయం. నిత్యం ప్రజల్లో ఉండాలని మోడీ సూచించారు.
- కొణతం దీపిక, మోండా మార్కెట్​ కార్పొరేటర్​ 


మహిళలు గెలవడం గొప్ప విషయమన్నరు
జీహెచ్​ఎంసీలో ఎక్కువ మంది మహిళలు గెలవడాన్ని ప్రధాని మోడీ అభినందించారు. 47 మంది బీజేపీ కార్పొరేటర్లలో 28 మంది మహిళలే ఉండడం గొప్ప విషయమన్నారు.
- సుప్రియ, ముషీరాబాద్​ కార్పొరేటర్​