అమెరికన్ మేధావులతో మోదీ భేటీ

అమెరికన్ మేధావులతో మోదీ భేటీ
  • బిజినెస్ లీడర్లు, విద్యావేత్తలతో భేటీ
  • వివిధ రంగాల ప్రముఖుల బృందంతో చర్చలు

న్యూయార్క్:  అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అక్కడి మేధావులు, విద్యావేత్తలు, బిజినెస్ లీడర్లు, ఇన్వెస్టర్లు, వివిధ రంగాల ప్రముఖులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ముందుగా ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ విజేత ప్రొఫెసర్ పాల్ రోమర్ తో ఆయన సమావేశమయ్యారు. ఆధార్ వినియోగం, డిజిలాకర్ వంటి డిజిటల్ టెక్నాలజీల్లో ఇండియా సాధించిన విజయాలపై చర్చించారు. పట్టణాభివృద్ధిలో తీసుకుంటున్న చర్యలపైనా ప్రొఫెసర్ రోమర్​తో తాను చర్చించానని మీటింగ్ తర్వాత మోదీ ట్వీట్ చేశారు. బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టర్ రే డాలియోతోనూ ప్రధాని భేటీ అయ్యారు.  ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని ఆయనను ఆహ్వానించారు. అలాగే ప్రముఖ ఆస్ట్రోఫిజిసిస్ట్ నీల్ డీ గ్రేస్ టైసన్ తోనూ ప్రధాని సమావేశమయ్యారు. అంతరిక్ష రంగంలో ఇండియా చేపట్టిన వివిధ మిషన్లపై ఆయనతో చర్చించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, అమెరికన్ బుద్ధిస్ట్ స్కాలర్ ప్రొఫెసర్ రాబర్ట్ తుర్మన్ తో కూడా మోదీ భేటీ అయ్యారు. ప్రపంచ సవాళ్లకు బుద్ధిస్ట్ విలువలు ఆశాదీపాలుగా నిలుస్తాయని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. బుద్ధిస్ట్ వారసత్వ పరిరక్షణకు ఇండియా చేపట్టిన చర్యలను ప్రొఫెసర్ రాబర్ట్ ప్రశంసించారని మీటింగ్ తర్వాత మోదీ ట్వీట్ చేశారు. 

ఇతర ప్రముఖులతోనూ..

అమెరికన్ మ్యాథమెటీషియన్ ప్రొఫెసర్ నసీమ్ నికోలస్ తలేబ్ తో కూడా మోదీ భేటీ అయ్యారని, ఇండియాలో స్టార్టప్ ఎకోసిస్టంపై ఆయనతో చర్చించారని ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే గ్రామీ అవార్డ్ విజేత, ఇండియన్ అమెరికన్ సింగర్ ఫల్గుని షా కూడా మోదీని కలిశారని వెల్లడించింది. మిల్లెట్స్ పై అవగాహన పెంచేలా ఫల్గుని షా పాడిన ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాటను ప్రధాని మెచ్చుకున్నారని, ఆమె తన మ్యూజిక్​తో రెండు దేశాల ప్రజలను ఒక్కటి చేస్తున్నారని ప్రశంసించారని పేర్కొంది. అలాగే హెల్త్, అగ్రికల్చర్, మార్కెటింగ్, ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖుల బృందంతో కూడా ప్రధాని భేటీ అయ్యారని విదేశాంగ శాఖ తెలిపింది.

రెండు దేశాల బంధం మరింత పటిష్టం: లిసా కర్టిస్ 

ప్రధాని మోదీ అమెరికా పర్యటనతో రెండు దేశాల బంధం మరింత బలోపేతం అయిందని ఇండో పసిఫిక్ సెక్యూరిటీ ప్రోగ్రాం డైరెక్టర్ లిసా కర్టిస్ అన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో ఇండియా పోషిస్తున్న పాత్రకు ప్రెసిడెంట్ బైడెన్ సర్కారు ప్రాధాన్యం ఇస్తోందని ఆమె తెలిపారు. అమెరికన్ కంపెనీ ‘జనరల్ అటామిక్స్’ నుంచి ఎంక్యూ–9బీ ప్రిడేటర్ సాయుధ డ్రోన్ ల కొనుగోలు ఒప్పందంపై మోదీ పర్యటనలో సంతకాలు జరిగే అవకాశాలు ఉన్నాయని కర్టిస్ వెల్లడించారు. చైనాకు దీటుగా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి ఈ డ్రోన్ లు ఇండియాకు బాగా పయోగపడతాయని లిసా కర్టిస్ పేర్కొన్నారు.