ఆస్ట్రేలియాలో అన్ని పక్షాలు స్వాగతించాయి.. పార్లమెంట్ ఓపెనింగ్ పై మోడీ పరోక్ష వ్యాఖ్యలు

ఆస్ట్రేలియాలో అన్ని పక్షాలు స్వాగతించాయి.. పార్లమెంట్ ఓపెనింగ్ పై మోడీ పరోక్ష వ్యాఖ్యలు

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా తప్పుపట్టారు. ఆరు రోజుల విదేశీ పర్యటనను ముగించుకొని ప్రధాని మోడీ గురువారం (మే 25న) ఉదయం భారత్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విపక్షాలపై విమర్శలు చేశారు. 

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో జరిగిన సభ గురించి ప్రధాని మోడీ గుర్తు చేశారు. ‘‘ఆ సభలో 20 వేల మంది పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌, మాజీ ప్రధాని, ఇతర విపక్ష ఎంపీలు, నేతలు వచ్చారు. అధికార, ప్రతిపక్ష నేతలు తమ దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అందులో పాల్గొన్నారు. ఒక కమ్యూనిటీ ఈవెంట్‌కు వారంతా కలిసికట్టుగా హాజరయ్యారు. వారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారు‘‘ అని మోడీ వ్యాఖ్యానించారు. 

కరోనా కేసులు ఎక్కువ ఉన్న సమయంలో భారతదేశం.. విదేశాలకు టీకాలు సరఫరా చేయడాన్ని అప్పట్లో విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. ప్రధాని మోడీ దాని గురించి కూడా ప్రస్తావించారు.‘‘సంక్షోభ సమయంలో మోడీ ప్రపంచ దేశాలకు టీకాలు ఎందుకు ఇస్తున్నారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. ఇది బుద్ధుడు, గాంధీ తిరిగిన నేల. మనం మన శత్రువుల గురించి కూడా ఆలోచిస్తాం. మనం కరుణతో ప్రేరేపితమైన వ్యక్తులం’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేకుండా పార్లమెంట్ కొత్త భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని విపక్షాలు నిలదీస్తున్నాయి. గతంలో పార్లమెంటులోని అనుబంధ భవనాలకు అప్పటి ప్రధానులు ఇందిరగాంధీ, రాజీవ్‌ గాంధీలే ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. 

మే 28వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తాము హాజరుకాబోమంటూ 19 ప్రతిపక్ష పార్టీలు బుధవారం (మే 24న) ప్రకటన విడుదల చేశాయి. మరోవైపు.. శిరోమణి అకాలీదళ్‌, వైసీపీ, బిజూ జనతాదళ్‌ హాజరవుతామని తెలిపాయి. తెలంగానలోని బీఆర్ఎస్ మాత్రం దీనిపై గురువారం (మే 25న) నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.