
న్యూఢిల్లీ : గ్లోబల్ గవర్నెన్స్ విఫలమైందని, ఇటీవల ఎదురైన సవాళ్లే ఇందుకు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆర్థిక సంక్షోభాలు, వాతావరణ మార్పులు, మహమ్మారులు, టెర్రరిజం, యుద్ధాలతో గత కొన్నేండ్లలో ఎదురైన అనుభవాలు.. ప్రపంచ స్థాయి సంస్థలు విఫలమయ్యాయని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం మల్టీల్యాటరిజం సంక్షోభంలో ఉందని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ మాట్లాడారు. ‘‘ప్రపంచ స్థాయి సంస్థల వైఫల్యం ప్రభావం ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే పడుతోంది. ఇన్నేండ్ల అభివృద్ధి తర్వాత.. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మళ్లీ మనం వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది.
తమ ప్రజలకు ఆహార, ఇంధన భద్రత కల్పించే క్రమంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు అప్పులపాలవుతున్నాయి. ధనిక దేశాల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ తో ఎక్కువగా ప్రభావితమవుతున్న దేశాలు కూడా ఇవే. అందుకే జీ20 ప్రెసిడెన్సీ కంట్రీగా దక్షిణాది దేశాల వాయిస్ ను వినిపించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం” అని చెప్పారు. తమ నిర్ణయాలతో ప్రభావితమవుతున్న దేశాల మాట వినకుండా.. ఏ దేశం కూడా తమను తాము గ్లోబల్ లీడర్ గా ప్రకటించుకోలేదని అన్నారు. ‘‘ప్రపంచం విడిపోతున్న సమయంలో మనం ఇక్కడ సమావేశమయ్యాం. గాంధీ, బుద్ధుడు పుట్టిన భూమిలో కలుసుకున్నం. మా దేశ నాగరికత నుంచి మీరందరూ స్ఫూర్తి పొందాలని ప్రార్థిస్తున్నాను. మనల్ని విడదీసే వాటిపై కాకుండా, మనల్ని ఏకం చేసే వాటిపై దృష్టి పెట్టాలి. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ముందుకురావాలి” అని పిలుపునిచ్చారు.
ఏకాభిప్రాయం రాలే: జైశంకర్
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, పరిష్కారానికి దారి చూపాల్సిన బాధ్యత జీ20 గ్రూప్ పై ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఆహార, ఇంధన భద్రత, ఉక్రెయిన్ వివాదం సహా పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రావాలని సభ్య దేశాలను కోరారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొవడానికి రూపొందించిన డాక్యుమెంట్ పై ఏకాభిప్రాయం కుదరలేదన్నారు. ఉక్రెయిన్ వివాదానికి సంబంధించి సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, సంయుక్త ప్రకటన రాలేదని పేర్కొన్నారు.
అత్యంత జనామోదం కలిగిన లీడర్ మోడీ : ఇటలీ పీఎం మెలోనీ
పీఎం నరేంద్ర మోడీపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచంలో అత్యంత జనామోదం కలిగిన నాయకుడు మోడీ అని కొనియాడారు. భారత విదేశాంగ శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘రైసినా డైలాగ్’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రసంగించేందుకు జార్జియా గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెకు రాష్ట్రపతి భవన్ వద్ద మోడీ స్వాగతం పలికారు. అనంతరం రెండు దేశాల ప్రధానులు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. జార్జియా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో మోడీకి అత్యంత ప్రజామోదం ఉందని నిరూపితమైంది. అందుకు ఆయనకు అభినందనలు” అని పేర్కొన్నారు. ఇక అంతకుముందు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇటలీ ప్రధాని భేటీ అయ్యారు.