
ప్రాథమిక విద్య మాతృ భాషలోనే!
కొత్త జాతీయ విద్యా విధానంలో రూల్ పెట్టినం: ప్రధాని మోడీ
గాంధీనగర్ : మాతృ భాషలోనే విద్యార్థులకు ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. స్థానిక భాషల్లో చదువు చెప్పాలని, గ్రామాల్లో ప్రతిభావంతులైన యువకులు టీచర్లుగా మారేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఇందుకోసం కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)నిబంధనలు పెట్టినట్లు తెలిపారు.
గతంలో విద్యార్థులు పుస్తకజ్ఞానం మాత్రమే పొందే వారిని, ఎన్‌ఈపీతో మార్పు వస్తుందని ప్రధాని అన్నారు. ప్రాక్టికల్ లెర్నింగ్‌పై ఎన్‌ఈపీ ఫోకస్ పెడుతుందని, ఈ విధానాన్ని అమలు చేయడం ఉపాధ్యాయుల బాధ్యతని చెప్పారు. శుక్రవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆలిండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 29వ బైయాన్యువల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్‌లో టీచర్లను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.
ప్రైమరీ టీచర్‌ది ముఖ్య పాత్ర
సమాచారం కావాలంటే గూగుల్ కూడా ఇస్తుంది కానీ టీచర్ల పాత్ర.. స్టూడెంట్లకు మెంటార్లలా ఉంటుందని ప్రధాని చెప్పారు. పిల్లల్ని మలచడంలో ప్రైమరీ టీచర్‌ది ముఖ్య పాత్ర అని.. ఫ్యామిలీ తర్వాత పిల్లలు ఎక్కువ టైం గడిపేది టీచర్ల దగ్గరేనని.. వారి వ్యవహార శైలిని చూసి నేర్చుకుంటారని అన్నారు.
నేను నిత్య విద్యార్థిని
‘‘టీచింగ్ అనేది గొప్ప వృత్తి. నేనెప్పుడైనా ప్రపంచ లీడర్లను కలిసినప్పుడు.. అది భూటాన్, సౌదీ అరేబియా వంటి రాచరిక పాలకులైనా సరే.. ‘ఇండియాకు చెందిన టీచర్లు మాకు చదువు చెప్పారు’ అని అంటుంటారు. తన టీచర్‌ది గుజరాత్ అని సౌదీ అరేబియా రాజు (సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్) నాతో చెప్పారు” అని ప్రధాని వివరించారు. తాను పీఎంగా ఉన్నప్పటికీ.. ఇప్పటికీ తన టీచర్లతో కాంటాక్ట్స్ ఉన్నాయని పేర్కొన్నారు.
రూ.4,400 కోట్ల ప్రాజెక్టులకు పచ్చజెండా
గాంధీనగర్‌లో రూ.4,400 కోట్ల ప్రాజెక్టుల్లో కొన్నింటికి ప్రధాని శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని దేశానికి అంకితం చేశారు. ‘గృహ ప్రవేశ్’ స్కీమ్ కింద నిర్మించిన 19 వేల ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు.