బార్ కాదిది జైలే.. బెంగళూరు సెంట్రల్ జైల్లో ఖైదీల మందు, చిందు.. మరో రెండు వీడియోలు వెలుగులోకి

బార్  కాదిది జైలే.. బెంగళూరు సెంట్రల్ జైల్లో ఖైదీల మందు, చిందు.. మరో రెండు వీడియోలు వెలుగులోకి

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్  జైల్లో మరోసారి అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. జైల్లో ఖైదీలు మందు తాగుతూ, స్నాక్స్  తింటూ డాన్స్ చేస్తున్న రెండు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఓ వీడియోలో ట్రేపై మందుపోసిన డిస్పోజబుల్  గ్లాస్, కట్  చేసిన పండ్లు, ఫ్రైడ్  పల్లీలు కనిపించాయి. 

ఖైదీలు పార్టీ చేసుకోవడానికే ఏర్పాట్లు చేశారన్నట్లు ఆ వీడియో ఉంది. మరో వీడియోలో ఖైదీలు మందు తాగుతూ, డ్యాన్స్  చేస్తూ పార్టీ చేసుకుంటూ గడిపిన దృశ్యాలు ఉన్నాయి. కొంతమంది కంచాలు వాయిస్తుండగా.. మరి కొంతమంది ఖైదీలు చిందులు వేస్తూ కనిపించారు. తాజా వీడియోలపై విమర్శలు వెల్లువెత్తాయి. 

జైల్లో ఖైదీలకు రాచమర్యాదలు చేస్తున్నారంటూ అధికారులపై పలువురు మండిపడ్డారు. కాగా.. ఐఎస్  రిక్రూటర్  జుహైబ్  హమీద్  షకీల్  మన్నా, సీరియల్  రేపిస్ట్  కిల్లర్  ఉమేశ్  రెడ్డి ఇదే పరప్పన సెంట్రల్  జైల్లో ఫోన్లు వాడుతూ కనిపించిన వీడియో ఒకటి శనివారం బయటకు వచ్చింది. అలాగే, రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్  కేసులో అరెస్టైన తరుణ్​ రాజ్ కూడా ఇదే జైల్లో ఫోన్  వాడుతూ కనిపించాడు. ఈ వ్యవహారంపై సిద్దరామయ్య సర్కారు విచారణకు ఆదేశించింది. అయితే, ఆ మరుసటి రోజే మరో రెండు వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది.