
- 577 కాలేజీలకు ఇంకా అఫిలియేషన్ రాలె
- మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు సెకండియరకూ నో పర్మిషన్
- ఏటా ఇదే తంతూ.. అయినా చోద్యం చూస్తున్న ఇంటర్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ ఇంటర్మీడియేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇంటర్ బోర్డు గుర్తింపు లేకుండానే యథేచ్ఛగా అడ్మిషన్లు తీసుకుంటూ, క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఇంటర్ బోర్డు అధికారులు వాటిపై చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని కాలేజీలతో పాటు ఫైర్ సేఫ్టీ లేకుండా నడిచే కాలేజీలు ఏటా ఇదే విధానాన్ని కొనసాగిస్తుండటం విస్మయానికి గురిచేస్తున్నది. విద్యాసంవత్సరం చివరిలో విద్యార్థుల భవిష్యత్ రీత్యా అంటూ సర్కారు పర్మిషన్ ఇవ్వడం పరిపాటిగా మారింది.
సెకండియర్ స్టూడెంట్ల పరిస్థితి ఎట్ల?
మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు రెండేండ్ల కింద అప్పటి సర్కారు రెండు విద్యాసంవత్సరాలకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. దీనికి అనుగుణంగా బోర్డు కూడా 2022–23, 2023–24 అకాడమిక్ ఇయర్లు ఆయా కాలేజీలను పట్టించుకోలేదు. అప్పట్లోనే 2023–24 లో చేరే స్టూడెంట్ల నుంచి ఇంటర్ బోర్డు అధికారులు నో ఆబ్జెక్షన్ లెటర్‌ను తీసుకోవాలని కాలేజీలకు ఆదేశాలిచ్చారు.
ఒకవేళ సెకండియర్‌లో కాలేజీ గుర్తింపు రాకుంటే.. దానికి తమ తప్పిదమే అన్నట్టు స్టూడెంట్ల నుంచి లేఖలు తీసుకున్నారు. ప్రస్తుతం మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని కాలేజీలకు బోర్డు ఇంకా గుర్తింపు ఇవ్వలేదు. దీంతో ఆయా కాలేజీల్లో సెకండియర్ చదువుతున్న స్టూడెంట్ల పరిస్థితి అయోయమంగా మారింది. అయితే, ఆ భవనాల్లో ఉంటే గుర్తింపు ఇవ్వరని తెలిసి కూడా.. మేనేజ్మెంట్లు ఈ విద్యాసంవత్సరం ఫస్టియర్ అడ్మిషన్లు
తీసుకున్నారు. ఏయే కాలేజీలకు గుర్తింపు లేదనే విషయం తెలిసినా కూడా.. ఇంటర్ బోర్డు అధికారులు, డీఐఈఓలు వాటిల్లో అడ్మిషన్ల ప్రక్రియను అడ్డుకోలేదు. కనీసం గుర్తింపు లేని కాలేజీల్లోని స్టూడెంట్లను ఏం చేయాలనే దానిపైనా ఇంటర్ బోర్డు అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవాలంటూ బోర్డు అధికారులు చేతులేత్తుస్తున్నారు. గుర్తింపు లేని కాలేజీలపై చర్యలు తీసుకోవడానికి ఇబ్బంది ఏంటని స్టూడెంట్ యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి. పిల్లల భవిష్యత్ దృష్ట్యా అంటూ మేనేజ్మెంట్లు , మళ్లీ స్పెషల్ పర్మిషన్ కోసం సర్కారు చుట్టూ తిరుగుతాయని పేర్కొంటున్నాయి.
901 కాలేజీలకే గుర్తింపు
రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకు పైగా ఇంటర్ కాలేజీలున్నాయి. వీటిలో ఈ విద్యాసంవత్సరం 1,478 ప్రైవేటు కాలేజీలు రిజిస్టర్ చేసుకు న్నాయి. ఇప్పటివరకు 901 కాలేజీలకు మాత్రమే ఇంటర్ బోర్డు గుర్తింపు ఇచ్చింది. మిగిలిన 577 కాలేజీలు ఇప్పటికీ అఫిలియేషన్ పొందలేదు. ఈ నెల 1 నుంచే 2024–25 విద్యాసంవత్సరం ప్రారంభమైంది. అయినా, అఫిలియేషన్ల ప్రక్రియ ఇంకా ముగియలేదు.
అయితే, ఈ గుర్తింపు లేని కాలేజీల్లోనూ అడ్మిషన్లు జరగ్గా, ప్రస్తుతం క్లాసులూ కొనసాగుతున్నాయి. అయినా, ఇంటర్ బోర్డు అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. గుర్తింపు ఉన్న కాలేజీల లిస్టును ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో పెడ్తామని ప్రకటించి నా, ప్రస్తుతం ఆ వెబ్సైట్ పనిచేయడం లేదు. ప్రతిసారి ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఇలాగే అడ్మిషన్లు చేయడం, చివరి నిమిషంలో సర్కారు నుంచి ప్రత్యేక అనుమ తులు తెచ్చుకోవడం సాధారణమైపోయింది.