- అఫిలియేషన్ లేకుండానే యథేచ్చగా క్లాసులు.. అడ్మిషన్లు
- కాప్రాలో బిల్డింగ్ పర్మిషన్.. బంజారాహిల్స్‌లో కాలేజీ!
- అనుమతి లేకుండానే ఏకంగా ఏడు క్యాంపస్ లతో కాలేజీ
- రూల్స్ బ్రేక్ చేసినా పట్టించుకోని విద్యాశాఖ ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కాలేజీల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. కొన్ని కాలేజీల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కి ‘ఇల్లీగల్’ దందా సాగిస్తున్నాయి. అఫిలియేషన్లు లేవు.. బిల్డింగ్ పర్మిషన్లు అసలే లేవు. కానీ, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్లు మాత్రం కానిచ్చేస్తున్నాయి. విద్యాశాఖ అధికారుల కళ్లు గప్పి కొందరు, వారి అండదండలతో మరికొందరు విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్నారు. అనుమతి పొందిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసి పక్కాగా కమర్షియల్ బిజినెస్ నడుపుతున్నారు.
అనుమతులు రాకముందే అడ్మిషన్లు షురూ..
రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలోని పీబీఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ కింద ఉన్న సెంట్ ఆంటోనీ డిగ్రీ కాలేజీ.. మేనేజ్‌మెంట్ మారడంతో పేరు మార్చి ‘ఆరా ఎడ్యుకేషన్ సొసైటీ’ కిందికి తెచ్చేందుకు టీజీసీహెచ్‌ఈకి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా అనుమతులు రాకముందే అడ్మిషన్లు, క్లాసులు మొదలుపెట్టేశారు. నిబంధనల ప్రకారం కాలేజీ ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడి మున్సిపల్ అధికారుల నుంచి బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ, ఈ కాలేజీ యజమాన్యం కాప్రా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుని, బంజారాహిల్స్‌లో డిగ్రీ తరగతులు నిర్వహిస్తోందన్న ఆరోపణలున్నాయి.
అప్లికేషన్‌లో ‘ఆరా డిగ్రీ కాలేజీ’ అని పేరు పెట్టి.. బిల్డింగ్ పైన మాత్రం ‘గ్లోబల్ బిజినెస్ స్కూల్’ అనే పేరు తగిలించి తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోనీ ప్లే గ్రౌండ్ ఉందా..? అంటే.. అది కూకట్‌పల్లిలో ఉందని చూపిస్తున్నారు. ఇలా అన్నీ అడ్డగోలు వ్యవహారాలు నడుస్తున్నాయి. ఈ కాలేజీలో డిగ్రీ ఒక్క ఏడాదికి రూ. 2 లక్షల చొప్పున ఫీజు వసూలు చేస్తుండడం గమనార్హం. ఫైర్ ఎన్ఓసీ సర్కారు నుంచి తీసుకోవాల్సి ఉండగా, ఓ ప్రైవేట్ సంస్థ నుంచి పొందడం అనుమానాలకు తావిస్తోంది.
అధికారుల అండతో మరిన్ని కాలేజీలు..
ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆదిత్య విద్యాసంస్థలదీ అదే తీరు. టీజీసీహెచ్‌ఈకి కూడా అప్లై చేసుకోకముందే ఆ కాలేజీలు నగరంలో ప్రచారం మొదలుపెట్టాయి. ఓయూ అనుబంధంగా ఈ కాలేజీలు నడుస్తున్నాయని, డిగ్రీ కాలేజీ, బిజినెస్ స్కూల్ అంటూ బోర్డులు పెట్టినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. చివరికి ఏడు కాలేజీలకు అప్లై చేసుకుంటే.. ఇటీవల టీజీసీహెచ్‌ఈ నాలుగు కాలేజీలకు షిఫ్టింగ్ కోసం సర్కారుకు ప్రపోజల్స్ పంపించింది.
దీంట్లో మూడు కాలేజీలకు అనుమతులు ఇవ్వడం కుదరదని ఓయూ అధికారులు ప్రతిపాదనలు అందజేశారు. ఇలా ఏటా పదుల సంఖ్యలో ప్రతిపాదనలు పంపిస్తుంటారని, చివరికి అనుమతులు వస్తేనే పర్మిషన్ వచ్చినట్టు అని అధికారులు చెప్తున్నారు. అయితే, ప్రస్తుతం ఆయా కాలేజీలు మాత్రం గుర్తింపు లేకుండానే యథేచ్చగా కొనసాగుతున్నాయి. వివిధ సంఘాల ఫిర్యాదులతో ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు.
ఈ కాలేజీలకు ఇటు టీఏఎఫ్‌ఆర్‌సీ, ఓయూ అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈ కాలేజీల మేనేజ్‌మెంట్.. దీన్ని ప్రారంభించేందుకు ఇతర ప్రైవేటు డిగ్రీ, జూనియర్ కాలేజీల మేనేజ్‌మెంట్ల సంఘం ప్రతినిధులకు దావత్ ఇవ్వడం గమనార్హం. ఈ సెటిల్‌మెంట్ వ్యవహారాల వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి అక్రమ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఏడు కాలేజీలకు ఇంటర్ బోర్డు పర్మిషన్ లేదు..
నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్ బోర్డు గుర్తింపు లేకుండానే ధనిక్ భారత్ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్బీనగర్, బొంగులూరు, మాదాపూర్, కూకట్‌పల్లి, మదీనాగూడ తదితర ప్రాంతాల్లో ఏకంగా ఏడు క్యాంపస్‌లను ఇంటర్ బోర్డు అనుమతి లేకుండానే నిర్వహిస్తూ క్లాసులు నడుపుతున్నారు.
పలుచోట్ల అకాడమీ పేరుతో ఈ కాలేజీలు నడుస్తుండగా, సీజేఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగారెడ్డి డీఐఈవో నోటీసులు కూడా జారీ చేశారు. ఈ సంస్థలకు పేరున్న సివిల్ సర్వీసెస్ కోచింగ్ నిర్వాహకురాలు డైరెక్టర్‌గా కొనసాగుతుండడం గమనార్హం. పలు జిల్లాల్లోనూ ఇంకా పర్మిషన్లు రాకపోయినా కొన్ని కాలేజీలు యథేచ్చగా కొనసాగుతున్నాయి.
