ఫీజు రీయింబర్స్‌‌ మెంట్‌‌పై ప్రైవేట్ కాలేజీలన్నీ ఏకతాటిపైకి.. కోర్టు ఆదేశాలతో మేనేజ్‌‌ మెంట్ ప్రతినిధుల సమావేశం

ఫీజు రీయింబర్స్‌‌ మెంట్‌‌పై ప్రైవేట్ కాలేజీలన్నీ ఏకతాటిపైకి.. కోర్టు ఆదేశాలతో మేనేజ్‌‌ మెంట్ ప్రతినిధుల సమావేశం
  •     వచ్చే ఏడాది నుంచి విద్యార్థుల దగ్గరే ఫీజులు వసూలు చేసుకోవాలన్న హైకోర్టు
  •     అదే కేసులో ఇంప్లీడ్ పిటిషన్లు వేయాలని మిగతా కాలేజీల ఏర్పాట్లు
  •     11న ఫతీ జనరల్ బాడీ మీటింగ్‌‌కు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: సర్కారు నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిల కోసం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. బకాయిల చెల్లింపుపై తాజాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో శుక్రవారం కీలక నేతలంతా హైదరాబాద్‌‌లో సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌‌, ఫార్మసీ సహా ఇతర ప్రొఫెషనల్ కాలేజీలన్నీ ఇదే కేసులో ఇంప్లీడ్ కావాలని నిర్ణయించారు. దీంతో పాటు సర్కారు పెద్దలను కలిసి పాత బకాయిలను రిలీజ్ చేయాలని విజ్ఞప్తులు చేయాలని, ఈ క్రమంలోనే పేరెంట్స్, స్టూడెంట్ల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. 

హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. 

ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌కు సంబంధించి హైకోర్టులో సాగుతున్న విచారణలో భాగంగా.. ఇప్పటికే పలు కాలేజీలకు అనుకూలంగా గురువారం మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వం కౌంటర్‌‌ దాఖలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు.. 2026–-27 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులతోనే నేరుగా ట్యూషన్‌‌ ఫీజు వసూలు చేసుకోవడానికి ఆయా కాలేజీలకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని మిగిలిన ప్రైవేటు కాలేజీలు అదే కేసులో ‘ఇంప్లీడ్‌‌’ పిటిషన్లు దాఖలు చేయాలని శుక్రవారం నిర్ణయించాయి. 

దీనిలో 135 ప్రైవేటు ఇంజినీరింగ్‌‌, 113 ఫార్మసీ, 205 బీఈడీ, 300 ఎంబీఏ అండ్ ఎంసీఏ, 75 నర్సింగ్‌‌, 26 లా కాలేజీలు భాగస్వామ్యం కానున్నాయి. ఈ క్రమంలో సుమారు ఐదేండ్ల నుంచి బకాయి పడ్డ రూ.10 వేల కోట్ల ఫీజు రీయంబర్స్‌‌మెంట్ ఇష్యూపై చర్చించేందుకు ఈ నెల11న ప్రైవేటు కాలేజీల మేనేజ్‌‌మెంట్ల సంఘం (ఫతీ) జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నాయి.

తుది తీర్పు వ్యతిరేకంగా వస్తే ఫీజులు వెనక్కి.. 

హైకోర్టు పలుమార్లు సమయం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. కోట్లాది రూపాయల బకాయిలు ఉండటం వల్ల విద్యా సంస్థల నిర్వహణ కష్టమవుతోందని ప్రాథమికంగా గుర్తించింది. దీనికి మధ్యంతర పరిష్కారంగా.. పాత జీవోలతో సంబంధం లేకుండా, వచ్చే విద్యాసంవత్సరం (2026–-2027) నుంచి ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల నుంచి నేరుగా ట్యూషన్ ఫీజు వసూలు చేసుకోవడానికి ఆయా విద్యా సంస్థలకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఒకవేళ ఈ కేసులో తుది తీర్పు పిటిషనర్లకు వ్యతిరేకంగా వస్తే, విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజును తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేస్తూ, విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.