సర్కారు దవాఖాన్లలో ఫ్రీగా పనిజేస్తాం: ఐఎంఏ

సర్కారు దవాఖాన్లలో ఫ్రీగా పనిజేస్తాం: ఐఎంఏ

హైదరాబాద్‌, వెలుగు: సర్కారు దవాఖాన్లలో రోజూ 3 గంటల పాటు ఫ్రీ సర్వీస్‌ చేసేందుకు ప్రైవేటు డాక్టర్లు ముందుకొచ్చారు. జ్వర బాధితులు దవాఖాన్లకు ఎక్కువగా వస్తుండడంతో, తమ వంతుగా ప్రభుత్వానికి, ప్రజలకు సేవచేయాలని నిర్ణయించుకున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌(ఐఎంఏ) స్టేట్‌ ప్రెసిడెంట్ డాక్టర్‌‌ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. ఐఎంఏ సెక్రటరీ, డాక్టర్ సంజీవ్ సింగ్‌ యాదవ్‌, ప్రైవేటు నర్సింగ్ హోమ్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్ డాక్టర్ రవీందర్‌‌తో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సీజన్‌లో జ్వరాలు రావడం సాధారణమే అయినా.. ఈ ఏడాది బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని సంజీవ్ సింగ్ చెప్పారు. ఇందులో ఎక్కువగా వైరల్ ఫీవర్ కేసులే ఉంటున్నాయని చెప్పారు. జ్వరం వచ్చినపుడు ప్లేట్‌లెట్‌ కౌంట్​ తగ్గడం మామూలేనని, కౌంట్​ తగ్గితే డెంగీ అని భయపడొద్దని ప్రజలకు సూచించారు. పెద్దవాళ్లలో 25 వేల కంటే తక్కువ, చిన్న పిల్లల్లో 50 వేల కంటే తక్కువ కౌంట్‌ ఉంటేనే, ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సి వస్తుందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ, కాచి వడబోసిన నీరు, శుభ్రమైన ఆహారం తీసుకుంటూ ట్యాబ్లెట్లు వాడితే సరిపోతుందన్నారు.

సర్కారు దవాఖాన్లలో ఉచితంగా పన్జేసేందుకు సిద్ధమని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్ తెలిపింది. బాధితులకు ఫ్రీగా సేవలందించేందుకు తమ అసోసియేషన్ సిద్ధంగా ఉందని తన్హా ప్రెసిడెంట్‌ డాక్టర్‌‌ రాకేశ్‌ చెప్పారు. ప్రభుత్వ, ప్రతిపక్షాలు ఫీవర్​ కేసులపై రాజకీయం చేయొద్దని డాక్టర్​ రవీందర్​ హితవు పలికారు.

private-doctors-ready-to-free service-in-government-hospitals-for-3-hours-of-daily