కన్వీనర్ కోటాకూ అదనపు వసూళ్లు...ప్రైవేట్‌‌ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల వేట

కన్వీనర్ కోటాకూ అదనపు వసూళ్లు...ప్రైవేట్‌‌ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల వేట
  •     ఒక్కో స్టూడెంట్ నుంచి రూ.20 వేల నుంచి రూ. 50 వేలు అడిషనల్‌‌ ఫీజు
  •     జీవోలో తీసుకోవద్దని చెప్పినా వినని మేనేజ్‌‌మెంట్లు
  •     అదనపు ఫీజుల పేరిట ఈ ఏడాది  రూ.200 కోట్లు వసూలు చేసిన యాజమాన్యాలు 
  •     సర్కారు తగ్గించిన ఫీజుల లోటును భర్తీ చేసుకుంటున్న కాలేజీలు 
  •     క్యాష్ రూపంలోనే తీసుకొని.. రసీదు ఇవ్వట్లే

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు అక్రమ ఫీజుల వేట మొదలుపెట్టాయి. విద్యార్థులు ఇంకా క్లాసుల్లో అడుగుపెట్టకముందే.. అదనపు వసూళ్లతో మేనేజ్‌‌మెంట్లు జేబులు నింపుకుంటున్నాయి. ఈ మూడేండ్ల ఫీజుల పీరియడ్‌‌లో ఎలాంటి అడిషనల్‌‌ ఫీజులు వసూలు చేయొద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, కాలేజీ యాజమాన్యాలు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. అడ్మిషన్ల కోసం అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి నుంచి కనిష్టంగా రూ.20 వేలు, గరిష్టంగా రూ.50 వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ అక్రమ వసూళ్ల దందా దాదాపు రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. వేలల్లో డబ్బులు తీసుకుంటున్న కాలేజీలు, కనీసం ఫీజు కట్టినట్టు రసీదు కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో 176  ఇంజినీరింగ్ కాలేజీల్లో సుమారు 1.25 లక్షల సీట్లున్నాయి. వీటిలో 157 ప్రైవేటు కాలేజీలుండగా, కన్వీనర్ కోటాలో 90 వేల దాకా ఉన్నాయి. 

ఆయా కాలేజీల్లో 2025–26, 2026–27, 2027–28  విద్యా సంవత్సరాలకుగానూ కొత్త ఫీజులను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఖరారు చేసింది. వీటిలో 70 కాలేజీల్లో గతంలో ఉన్న పాత ఫీజులనే కొనసాగించగా.. 19 కాలేజీల్లో గతం కంటే తగ్గాయి. 63 కాలేజీల్లో మాత్రం స్వల్పంగా ఫీజులు పెరిగాయి. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రైవేటు కాలేజీలు జీర్ణించుకోలేకపోయాయి. కొన్ని కోర్టు మెట్లు ఎక్కినా.. పెద్దగా ఊరట లభించలేదు. దీంతో ఆ ఫీజుల లోటును పిల్లల నుంచే వసూలు చేసుకోవాలని నిర్ణయించాయి. అనుకున్నట్టుగానే స్టూడెంట్ల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే.. అదనపు ఫీజుల పేరుతో వసూళ్లకు తెరలేపాయి. 

రూ.200 కోట్ల వసూళ్లు.. 

గత ఫీజుల బ్లాక్ పీరియడ్‌‌లో ఇతర చార్జీల కింద విద్యార్థుల అడ్మిషన్ టైంలో రూ.8,500 లేదా రూ.5,500 వసూలుకు ప్రభుత్వం అనుమతి ఉండగా, ఈ సారి అది కూడా తీసేస్తూ  జీవో రిలీజ్ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్ ఫీజు కాకుండా, ఇతరత్రా ఏ పేరిట ఫీజులు వసూలు చేయకూడదని జీవోలో పేర్కొన్నది. అయినా సరే, కాలేజీలు మాత్రం సర్కారు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఫీజుల బాదుడునే కొనసాగిస్తున్నాయి. ఒక్కో కాలేజీ రూ.20 వేల నుంచి రూ.50వేల వరకూ వసూలు చేస్తున్నాయి. ఈ లెక్కన ఇప్పటికీ ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సుమారు 75 వేల సీట్లు భర్తీ అయ్యాయి. 

ఇలా సరిసరిగా లెక్కించిన ఈ ఏడాది  ఏకంగా రూ.200 కోట్ల దాకా అదనపు ఫీజులను మేనేజ్‌‌మెంట్లు వసూలు చేస్తున్నాయి. లైబ్రరీ, ల్యాబ్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, కెరీర్ డెవలప్‌‌మెంట్‌‌ చార్జీలు, యూనిఫామ్, జేఎన్టీయూ, కాలేజీ డెవలప్‌‌మెంట్‌‌ ఎన్‌‌బీఏ స్పెషల్ ఫీజు, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌‌మెంట్‌‌ ఫీజు.. ఇలా రకరకాల పేర్లతో విద్యార్థులపై భారీగా భారం వేస్తున్నారు. కొన్ని కాలేజీలు యూనిఫామ్ పేరుతోనూ వసూళ్లకు తెరలేపాయి. కన్వీనర్ కోటాలో సీటు సాధించి, ఉచితంగా చదువుకోవచ్చని ఆశతో ప్రైవేట్‌‌ కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు మేనేజ్‌‌మెంట్లు చుక్కలు చూపిస్తున్నాయి. సీటు ఫ్రీనే కానీ, కాలేజీ మెయింటెనెన్స్ కోసం ఈ ఫీజులు కట్టాల్సిందేననీ తేగేసి చెప్తున్నాయి. 

రికార్డులకు ఎక్కని లెక్కలు.. 

ఈ అక్రమ వసూళ్లన్నీ రికార్డుల్లోకి ఎక్కకుండా ప్రైవేటు కాలేజీలు పక్కాగా స్కెచ్ వేస్తున్నాయి. ఆన్‌‌లైన్ పేమెంట్లు, చెక్కులను నిరాకరిస్తూ.. కేవలం నగదు రూపంలోనే డబ్బులు కట్టాలని మేనేజ్‌‌మెంట్లు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు నామ్ కే వాస్తేగా కొంత ఆన్‌‌లైన్‌‌లో తీసుకొని, మెజారిటీ మొత్తాన్ని క్యాష్ రూపంలోనే లాగుతున్నాయి. డబ్బులు కట్టినా రసీదులు ఇవ్వకపోవడంతో.. తాము ఫీజు చెల్లించినట్టు ఆధారం లేకుండా పోయిందని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. 

అంతా ఫీజులోనే.. మళ్లీ ఎందుకు?

నిజానికి ప్రైవేట్‌‌ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఉండే ల్యాబ్‌‌లు, లైబ్రరీ, స్టూడెంట్లకు ఇచ్చే ట్రైనింగ్, ప్లేస్‌‌మెంట్లు, ఇతర వసతులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే టీఏఎఫ్ఆర్సీ ట్యూషన్ ఫీజును ఖరారు చేస్తుంది. కాలేజీ మేనేజ్‌‌మెంట్లు కూడా ఫీజు పెంచుకోవడానికి వీలుగా తమకు అయ్యే ఈ ఖర్చులన్నింటినీ టీఏఎఫ్ఆర్సీకి ఇచ్చే లెక్కల్లో స్పష్టంగా చూపిస్తాయి. పైగా కాలేజీలకు ఉండే న్యాక్, ఎన్‌‌బీఏ గుర్తింపునకు తగ్గట్టుగానే ఫీజుల పెంపు ఉంటుంది. అంటే విద్యార్థులు చెల్లించే ట్యూషన్ ఫీజులోనే ఈ వసతుల చార్జీలన్నీ కలిసి ఉన్నాయని అర్థం. కానీ, ప్రైవేటు కాలేజీలు ఈ విషయాన్ని దాచిపెట్టి, మళ్లీ అదే ల్యాబ్, లైబ్రరీ, అదే ట్రైనింగ్ పేరుతో విడివిడిగా వేల రూపాయలు దండుకుంటున్నాయి. టీఏఎఫ్ఆర్సీకి చూపించే ఆదాయ లెక్కల్లో ఈ అక్రమ వసూళ్ల వివరాలను ఎక్కడా చూపించకుండా, విద్యార్థుల పేరెంట్స్ పై ‘డబుల్’ భారం మోపుతున్నాయి.

కాలేజీలపై చర్యలు తీసుకోవాలి

సర్కారు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌‌ కాలేజీలు వసూలు చేస్తున్న అదనపు ఫీజులపై సమగ్ర విచారణ చేయించి, చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆ ఫీజులను స్టూడెంట్లకు రిటర్న్ ఇప్పించాలి. ప్రభుత్వం ఈ అదనపు ఫీజుల వసూళ్లపై స్పందించాలి. 
- సంతోష్​ కుమార్, టీఎస్​టీసీఈఏ స్టేట్ ప్రెసిడెంట్