ఆమెకు కరోనా లేకున్నా.. ఉందని సర్టిఫికేట్ ఇచ్చిన ప్రైవేట్ హాస్పిటల్

ఆమెకు కరోనా లేకున్నా.. ఉందని సర్టిఫికేట్ ఇచ్చిన ప్రైవేట్ హాస్పిటల్

షుగ‌ర్ టెస్ట్ కోసం ఆసుప‌త్రికి వెళితే అక్క‌డి సిబ్బంది క‌రోనా వైర‌స్ సోకిన‌ట్టు రిపోర్టు ఇచ్చార‌ని ఓ వృద్ధురాలు ఆరోపించింది. లేని వైర‌స్ ను ఉన్న‌ట్టు రిపోర్టు ఇవ్వడంతో తాము మాన‌సిక వేద‌న‌కు గుర‌య్యామ‌ని, ఇలాంటి త‌ప్పుడు రిపోర్టులు ఇవ్వ‌కుండా చూడాల‌ని ఆమె కుటుంబ స‌భ్యులు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన పడమటి వీరమణి (65) అనే వృద్ధురాలు షుగర్ పేషెంట్ కావ‌డంతో నెల19 న‌ (శుక్రవారం ) హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి షుగ‌ర్ టెస్ట్ ల కోసం వెళ్ళింది. కానీ అక్కడి వైద్య సిబ్బంది మాత్రం త‌న‌కు షుగర్ కి సంబందించిన పరీక్షలు చేయకుండా..కోవిడ్ టెస్ట్ చేయించు‌కోమ‌న్నార‌ని ఆమె తెలిపింది. ఆ ప‌రీక్ష‌ల‌ త‌ర్వా‌త‌నే షుగర్ కి సంబందించిన చికిత్స అందిస్తామని డాక్ట‌ర్లు చెప్పార‌ని, అందుకు అంగీక‌రించి బ్లడ్ శాంపిల్స్ కూడా ఇచ్చిన‌ట్టు పేర్కొంది.

ఆ శాంపిల్స్ ఆధారంగా ఈ నెల 20‌ (శనివారం ) మధ్యాహ్నం అపోలో ఆసుపత్రి సిబ్బంది ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్దారించ‌డంతో అపోలో ఆసుపత్రి ఇచ్చిన రిపోర్ట్ మీద నమ్మకం కోల్పోయి, అదే రోజున‌ గచ్చిబౌలి లోని AIG ఆసుపత్రికి వెళ్లింది. అక్క‌డ మ‌ళ్లీ కరోనా టెస్ట్ చేయించుకున్నాన‌ని, ఆదివారం మధ్యాహ్నం ఆ ఆసుపత్రి సిబ్బంది త‌న‌కు ఎలాంటి వైర‌స్ లేన‌ట్టు రిపోర్టు ఇచ్చార‌ని వీర‌మ‌ణి తెలిపింది.

కొన్ని రోజుల క్రితం త‌మ గ్రామ ప్ర‌జ‌ల‌కు త‌మ చేతుల మీదుగా కోవిడ్ వ్యాధి నిరోధక మందులు ఇచ్చామ‌ని వీర‌మ‌ణి కొడుకు మోహ‌న్ రెడ్డి తెలుపుతూ.. అపోలో ఆసుప‌త్రి వారు ఇచ్చిన త‌ప్పుడు రిపోర్టు కార‌ణంగా తాము మాన‌సిక వేద‌న‌కు గుర‌య్యామ‌ని వీర‌మ‌ణి కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. ఆ త‌ప్పుడు రిపోర్టు ‌కార‌ణంగా ప్ర‌భుత్వ సిబ్బంది తాము ఉన్న ప్ర‌దేశాన్ని కంటోన్మెంట్ జోన్ గా ప్ర‌క‌టించింద‌ని, ఆ త‌ర్వాత క‌రోనా వైర‌స్ లేద‌ని తెలిసి మ‌ళ్లీ దానిని తొలగించారన్నారు‌. అప్పటినుండి గ్రామ‌స్తులు తన కుటుంబాన్ని విచిత్రంగా చూస్తున్నారని, దీనితో త‌మ కుటుంబం మానసిక వేదనకు గురైంద‌న్నారు.

దయ చేసి ఇలాంటి తప్పుడు రిపోర్ట్స్ ద్వారా వేరే వ్యక్తులు ఎవ్వరు బాధపడకుండా అందరికీ న్యాయం చేయాలని, అన్ని ఆసుపత్రులలో కరోనా టెస్టుల కోసం సమాన ధర ఉండే విదంగా తెలంగాణ ప్రభుత్వం చూడాలని ఆయ‌న విజ్ఞప్తి చేశారు.