పైసలిచ్చేదాకా.. డెడ్ బాడీలకూ ట్రీట్​మెంట్

పైసలిచ్చేదాకా.. డెడ్ బాడీలకూ ట్రీట్​మెంట్
  • ప్రైవేటు హాస్పిటళ్ల ఇష్టారాజ్యం 
  • పట్టించుకోని ఆఫీసర్లు

వరంగల్, వెలుగు: రోగమో.. నొప్పో వచ్చి దవాఖానకు పోయినోళ్లను ప్రైవేటు హాస్పిటల్స్ దగా చేస్తున్నాయి. వైద్యం కోసం వచ్చిన పేషెంట్లకు సకాలంలో సరైన ట్రీట్​మెంట్​అందించాల్సింది పోయి.. పైసలు దండుకునేందుకు ప్లాన్లు వేస్తున్నాయి. పేద, ధనిక తేడా లేకుండా లక్షల్లో బిల్లులు వేసేవి కొన్నయితే.. హాస్పిటల్​లో అడ్మిట్ కాకముందే డబ్బులు కట్టించుకునేవి మరికొన్ని. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ ట్రెండ్ మార్చాయి. పేషెంట్లు చనిపోయిన విషయం కూడా దాచేసి.. బిల్లు మొత్తం క్లియర్ చేశాకే అసలు విషయాన్ని వెల్లడిస్తున్నాయి.  లక్షల్లో వేసిన బిల్లులు చెల్లిస్తేనే డెడ్​ బాడీ ఇస్తామని తెగేసి చెప్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక  అప్పోసప్పో చేసి అడిగినంత చెల్లించాల్సిన పరిస్థితి.

బిల్లు కట్టేదాక బతికున్నట్లు డ్రామా..

గ్రేటర్ వరంగల్ పరిధిలో దాదాపు 220 ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులున్నాయి. ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పేషెంట్లు ట్రీట్​మెంట్​కు వరంగల్ సిటీకే వస్తుంటారు. వరంగల్​లో ఎంజీఎం ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీల రిఫరెన్స్​ల వల్ల నగరంలోని ప్రైవేటు ఆసుపత్రులకు వస్తుంటారు. ఇదే అదునుగా ప్రైవేటు దవాఖానాలు దోపిడీకి తెరలేపుతున్నాయి. ప్రైవేటులో జాయిన్​ చేసిన పేషెంట్​మరణిస్తే.. చనిపోయిన విషయాన్ని బిల్లు కట్టేదాక బయటకు చెప్పడం లేదు. కొన్ని ఆసుపత్రులు పేషెంట్​చనిపోయినా ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లు యాక్షన్​చేస్తూ.. రూ.లక్షల్లో బిల్లులు వేస్తున్నాయి. అంత మొత్తం కట్టలేమని కాళ్లావేళ్లా పడినా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకుండా కర్కశంగా వ్యవహరిస్తున్నాయి.

డబ్బులే ముందు..

ప్రైవేటు ఆసుపత్రి కాంపౌండ్​ లో పేషెంట్ అడుగుపెట్టింది మొదలు డిశ్చార్జ్ అయ్యే వరకు పైసలతోనే పని జరుగుతోంది. పేషెంట్ సీరియస్​గా ఉన్నా ముందుగా డబ్బులు కడితేనే అందులో చేర్చుకుంటున్నాయి. పరిస్థితిని బట్టి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాల్సి ఉన్నా బిల్లు కట్టించుకునే వరకూ వెయిట్​ చేయిస్తుండటంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. గత నెల 25న రాంపూర్​ గ్రామానికి చెందిన కొమురమ్మ అస్వస్థతకు గురికావడంతో హన్మకొండ సుబేదారి ప్రాంతంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ముందుగా బిల్లు చెల్లిస్తేనే జాయిన్ చేసుకుంటామని చెప్పి ట్రీట్​మెంట్​అందించడంలో ఆలస్యం చేశారు. దీంతో పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. దీంతో పేషెంట్ ​తరఫు బంధువులు ఆందోళన చేపట్టారు.

ఆఫీసర్లు పట్టించుకుంటలేరు..

ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారీతిన దోపిడీకి పాల్పడుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. తెలంగాణ అల్లోపతిక్​ మెడికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు మిన్నకుండిపోతున్నారు. పేషెంట్ల తరఫు బంధువులు ప్రైవేటు దోపిడీలపై ఆందోళనలు చేపట్టినా కనీసం ఎంక్వైరీ చేయడం లేదు. ఆఫీసర్లు, ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యంపై జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, నిరుపేదలు దోపిడీకి గురి కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

జనవరి 7న వరంగల్​ రూరల్​ జిల్లా శాయంపేట మండలం గట్లకనపర్తికి చెందిన ప్రమీల(65)కు హార్ట్ స్ట్రోక్​రావడంతో ములుగు రోడ్డు పెద్దమ్మగడ్డ సమీపంలోని ఓ పెద్ద హాస్పిటల్​కు తీసుకెళ్లారు. ముందస్తుగా 1.50లక్షలు కట్టించుకున్న ఆసుపత్రి యాజమాన్యం.. రాత్రి 11 సమయంలో పేషెంట్ మృతి చెందిన విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపింది. రూ.2 లక్షలు చెల్లిస్తేనే డెడ్​బాడీ ఇస్తామని చెప్పడంతో వారి బంధువులు ఆందోళనకు దిగారు.

వరంగల్ ​రూరల్​ జిల్లా గీసుగొండ మండలం బొద్దుచింతలపల్లికి చెందిన గర్భిణి సరితను గత సెప్టెంబర్ 1న హన్మకొండ చౌరస్తా సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. 3న కడుపులోనే శిశువు మరణించినా.. ఆ విషయాన్ని 4వ తేదీన బిల్లు కట్టించుకునే దాకా ఆసుపత్రి యాజమాన్యం దాచిపెట్టింది. తీరా బిల్లు కట్టిన తరువాత పాప చనిపోయిందని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.