V6 News

లక్ష కడితేనే ఎంట్రీ! మెడికల్ కాలేజీల్లో అక్రమ వసూళ్లు

లక్ష కడితేనే ఎంట్రీ! మెడికల్ కాలేజీల్లో అక్రమ వసూళ్లు
  • కన్వీనర్ కోటాకు లక్ష.. మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.2 లక్షలకుపైనే వడ్డింపు
  • హెల్త్ మినిస్టర్ హెచ్చరించినా మారని యాజమాన్యాల తీరు 
  • డబ్బులు చెల్లించకుంటే అకడమిక్ ఇయర్​ ఆపేస్తామని బెదిరింపులు
  • ఫిర్యాదు చేసేందుకు జంకుతున్న మెడికోలు 
  • అక్రమ వసూళ్లపై కమిటీ వేయడంలో అధికారుల నిర్లక్ష్యం 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నయ్. రూల్స్​ను బ్రేక్ చేస్తూ ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నయ్. ఇప్పటికే నాలుగున్నరేండ్ల చదువుకు ఐదేండ్ల ఫీజులు గుంజుతున్నారని, స్టైపెండ్ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా లైబ్రరీ, స్పెషల్, మిస్లీనియస్ ఫీజుల పేరిట సరికొత్త దోపిడీకి తెరలేపాయి.

కన్వీనర్ కోటాలో మెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సీటు సాధించిన పేద విద్యార్థుల నుంచి కనీసం రూ. లక్ష, మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా విద్యార్థుల నుంచి రూ. 2 లక్షల దాకా అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు కట్టకుంటే క్లాసులకు రానివ్వమని, ఐడీ కార్డులు ఇవ్వమని వేధింపులకు గురిచేస్తున్నట్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.

నిబంధనలకు తిలోదకాలు.. 

ప్రభుత్వం ఇచ్చిన జీఓ నంబర్ 107, 108 ప్రకారం.. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు సంబంధించి అదనపు వసూళ్లు పూర్తిగా నిషేధం. నిర్ణయించిన ట్యూషన్ ఫీజు తప్ప...  లైబ్రరీ, స్పెషల్, మిస్లీనియస్, డొనేషన్ల పేరిట నయాపైసా వసూలు చేసినా అది చట్టవిరుద్ధమైన క్యాపిటేషన్ ఫీజు గానే పరిగణించాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. మెడికల్ కాలేజీలు అడ్మిషన్ సమయంలో ఖరారు చేసిన ఫీజునే కోర్సు పూర్తయ్యే దాకా కొనసాగించాలని, అలాగే విద్యార్థులకు ప్రభుత్వ కాలేజీల తరహాలోనే స్టైపెండ్ చెల్లించాలని జీఓల్లో స్పష్టంగా పేర్కొంది. ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు వదులుతూ లక్షలకు లక్షలు గుంజుతూ విద్యార్థులను నిలువునా దోచుకుంటున్నాయి. 

కమిటీ, రిపోర్టు జాడలేదు.. 

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న అదనపు ఫీజులపై గతంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో హాస్టల్, మెస్, లైబ్రరీ, స్పెషల్ ఫీజుల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయని, ఈ వసూళ్లపై ఓ కమిటీ ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజీల్లో అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారునుల ఆదేశించారు.

మంత్రి ఆదేశాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కమిటీ ఊసే లేకపోవడం గమనార్హం. మరోవైపు... మెడికల్ కాలేజీలపై వైద్య విద్య, వర్సిటీ అధికారుల పర్యవేక్షణ కరువైందనే విమర్శలు విద్యార్థుల నుంచి వస్తున్నాయి. పర్యవేక్షణకు వెళ్లినప్పుడు కాలేజీల్లో సౌకర్యాల మీద రిపోర్టులు ఇచ్చే అధికారులు, ఫీజుల రసీదుల దగ్గరకు వచ్చేసరికి కండ్లు మూసుకుంటున్నారని, అధికారుల ఉదాసీనత వల్లే ప్రైవేట్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని మండిపడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక విచారణ జరపాలని, అక్రమ వసూళ్లకు పాల్పడే కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.   

కాలేజీకో రేటు... 

క్యాష్ రూపంలోనే రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల స్థాయిని బట్టి రూ. లక్ష నుంచి రూ. 2లక్షలపైనే వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. చాలా కాలేజీలు అదనపు ఫీజులను కేవలం క్యాష్ రూపంలోనే అడుగుతుండటం గమనార్హం. చెక్కులు, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్ పేమెంట్లు తీసుకుంటే ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో ఓన్లీ క్యాష్ అని కండిషన్ పెడుతున్నాయి. ఇలా వసూలు చేసే కోట్లాది రూపాయలకు ఎలాంటి లెక్కాపత్రం ఉండటం లేదు. కన్వీనర్ కోటాలో మెరిట్ మీద సీటు సాధించిన పేద విద్యార్థులు కూడా ఈ అదనపు ఫీజులు కట్టలేక అప్పుల పాలవుతున్నారు.