ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనే  ‘ప్రైవేట్ స్టాఫ్’  

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనే  ‘ప్రైవేట్ స్టాఫ్’  
  • విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలైన బాగోతం!
  • ప్రభుత్వం రద్దు చేసినా ఆగని ఔట్ సోర్సింగ్ దందా
  • ఐదు నెలల కిందనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 24 మంది తొలగింపు  
  • కానీ దాదాపు 30 మంది ఇంకా కొనసాగింపు.. 
  • అధికారుల అండతో అనధికారిక వ్యక్తుల పెత్తనం!
  • డాక్యుమెంట్‌‌కు ఒక రేటు ఫిక్స్ చేసి అడ్డగోలు వసూళ్లు

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీలు సంచలనం సృష్టించాయి. 2019లో నియమించిన  24 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను,ఏజెన్సీల కాంట్రాక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల కిందనే రద్దు చేసింది. అయినప్పటికీ, అధికారులు మాత్రం ఆ సిబ్బందిని కార్యాలయాల నుంచి పంపించకుండా అనధికారికంగా కొనసాగిస్తున్నారు. ఐదు నెలలుగా జీతాలు లేకపోయినా, ఈ ప్రైవేట్ వ్యక్తులు ఆఫీసుల్లోనే తిష్ట వేసి రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ చక్కబెడుతుండటం గమనార్హం. అధికారుల అండతో వీరు కీలకమైన డేటా ఎంట్రీ, ఈ-కేవైసీ పనులు చేస్తూ, క్లయింట్ల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.

సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ..

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్​సోర్సింగ్ ఏజెన్సీలను అడ్డంపెట్టుకుని ఆఫీసర్లు ప్రతినెలా లక్షల రూపాయలు జీతాల రూపంలో స్వాహా చేస్తున్నారని ప్రభుత్వ విచారణలో తేలింది. ఉద్యోగులు లేకున్నా ఉన్నట్టు చూపించడం, ఎక్కువ మంది పనిచేస్తున్నట్టు బోగస్ రికార్డులు సృష్టించి జీతాల రూపంలో వందల కోట్లు కాజేశారు. దీంతో ఆ ఏజెన్సీల కాంట్రాక్టును ప్రభుత్వం రద్ధు చేసింది. అయితే, సిబ్బంది కొరతను సాకుగా చూపుతున్న సబ్ రిజిస్ట్రార్లు, పాత ఏజెన్సీల సిబ్బందినే ఇంకా ఆఫీసుల్లోనే ఉంచుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 30 మందికి పైగా ఇలాంటి అనధికారిక వ్యక్తులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏజెన్సీల కాంట్రాక్టు రెన్యువల్ అవుతుందనే ఆశ చూపిస్తూ, నిరుద్యోగుల నుంచి ఏజెన్సీలు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇక్కడే ఎక్కువ.. 

ఉమ్మడి జిల్లా మొత్తంలో నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఈ బాగోతం ఎక్కువగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీ డాక్యుమెంట్‌‌కు ఒక నిర్ణీత ధరను ఫిక్స్ చేసి, ఆ మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తుల ద్వారానే వసూలు చేస్తున్నట్లు విజిలెన్స్ ఎన్‌‌ఫోర్స్‌‌ మెంట్ వింగ్ గుర్తించింది. అధికారిక సిబ్బంది చేయాల్సిన పనులను ఈ ప్రైవేట్ వ్యక్తులే నిర్వహిస్తూ కార్యాలయాల్లో తమ పెత్తనం చెలాయిస్తున్నారు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ విభాగం, ఈ అక్రమ నియామకాలు, ఆర్థిక లావాదేవీలపై లోతైన దర్యాప్తు జరుపుతోంది.

భారీగా ముడుపులు!

సిబ్బంది కొరత వల్లనే వీరిని కొనసాగిస్తున్నామని కొందరు అధికారులు చెప్తున్నప్పటికీ, తెర వెనుక భారీగా ముడుపులు అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిరుద్యోగుల అవసరాన్ని అదునుగా చేసుకుని ఏజెన్సీలు, అధికార యంత్రాంగం కలిసి ఆడుతున్న ఈ అవినీతి నాటకం ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది. నల్లగొండ బాగోతం బయటపడటంతో ఇతర జిల్లాల్లోని కార్యాలయాల్లో కూడా ఇదే తరహా అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానంతో ఉన్నతాధికారులు నిఘా పెంచారు.