- తనకూ అదృష్టం ఉందన్న పరమేశ్వర
- కర్నాటకలో సీఎం మార్పుపై చర్చ..
- ఐదేండ్లూ తానే సీఎంనన్న సిద్ధూ
బెంగళూరు: కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే కర్నాటక సీఎం పదవి చేపట్టేందుకు తాను రెడీగా ఉన్నానని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొడుకు, ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే శుక్రవారం చెప్పారు. ‘ఏ నిర్ణయమైనా ఢిల్లీలో నలుగురు పెద్దలు కలిసి తీసుకుంటారు. వారు కాకుండా మిగతా ఎవరు మాట్లాడినా దానికి విలువ ఉండదు. ఏదైనా హైకమాండ్ చెప్పాలె. నన్ను సీఎం పదవి చేపట్టమని అడిగితే నేను ఒకే చెప్తాను’ అని అన్నారు. గత కొన్ని రోజులుగా కర్నాటక సీఎం మార్పు అంశంపై ఊహాగానాలు, చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ విషయంపై చర్చ, కామెంట్లు వద్దని చెప్పినప్పటికీ.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు సీఎం చాన్స్ ఉందంటూ, సీఎం ను మార్చుతారని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. దీనిపై స్పందిస్తూ.. రాష్ట్రంలో సీఎంను మార్చే ప్రసక్తే లేదని, ఐదేండ్లు తానే కొనసాగుతానని గురువారం సిద్ధరామయ్య తేల్చిచెప్పారు.
అయితే, ఆ మరుసటి రోజే హోంమంత్రి పరమేశ్వర సీఎం కుర్చీపై తన కోరికను బయటపెట్టారు. శుక్రవారం తుమకూరులో ఓ కార్యక్రమంలో పరమేశ్వర సన్నిహితుడు, మంత్రి కేఎన్ రాజన్న మాట్లాడుతూ సమీప భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చన్నారు. ‘‘ఈ రోజు పరమేశ్వర హోంమంత్రిగా ఉన్నరు. భవిష్యత్తులో ఆయనకు సీఎం అయ్యే అదృష్టం ఉందని నేను నమ్ముతున్న. దాన్ని సాధ్యం చేసేందుకు కృషి చేస్తం” అని అన్నారు. దీనిపై అక్కడే వేదికపై ఉన్న పరమేశ్వర మాట్లాడుతూ ‘‘రాజన్నకు నా కృతజ్ఞతలు. ఆ అదృష్టం కలగాలని నేను కూడా కోరుకుంటున్నాను. అయితే, హైకమాండ్ తనను ఎప్పుడు ఎలివేట్ చేస్తుందో తెలియదు” అని అన్నారు.
సీఎం పదవి ఖాళీగా లేదు: డీకే సురేశ్
సీఎం పదవి ఖాళీగా లేనప్పుడు దాని గురించి చర్చించడంలో అర్థంలేదని ఎంపీ డీకే సురేశ్ అన్నారు.‘‘సిద్ధరామయ్య సీఎం. సీఎం పోస్టే ఖాళీగా లేనప్పుడు సీఎం ఎవరవుతారనే చర్చలతో ఉపయోగం ఏమిటి” అని సురేశ్ ప్రశ్నించారు.

