
కుటుంబ పాలన గురించి కేటీఆర్ మాట్లాడడమా?
రాష్ట్రంలో ఏముందో అందరికీ తెలుసు : మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర యువతకు భరోసానిచ్చేందుకే ప్రియాంకా గాంధీ తెలంగాణకు వచ్చారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కానీ, ఆమె పర్యటనపై బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబపాలన అంటూ కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని, తెలంగాణలో ఏ పాలన జరుగుతున్నదో అందరికీ తెలుసని అన్నారు. తన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లోకి రారని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు తన కేబినెట్లో ఎవరిని మంత్రులుగా చేశారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మొదటి సీఎం దళితులే అన్న కేసీఆర్.. ఆ హామీని తుంగలోకి తొక్కారన్నారు. రాష్ట్రంలో ఒక్క శాతం జనాభా కూడా లేని వారికి మంత్రి వర్గంలో అన్ని పోస్టులు ఎందుకిచ్చారన్నారు. ప్రియాంకా గాంధీకి ఉండటానికి ఇల్లు లేదని, తనకంటూ పేపర్, విమానం, టీవీ వంటివేవీ లేవన్నారు. కానీ, 9 ఏండ్ల పాలనలో కేసీఆర్‌కు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన వారి శవాలపై పాలన చేస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. తీవ్రవాదాన్ని తరిమికొట్టే నేపథ్యంలోనే రాజీవ్‌గాంధీ బలయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.