- లోక్‌సభ ప్రసంగంలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం
- ప్రధాని, హోంమంత్రిలలో జవాబు చెప్పేదెవరని నిలదీత
న్యూఢిల్లీ: పరీక్షలు సజావుగా నిర్వహించాలని, పేపర్ లీక్‌కు బాధ్యులైన వారికి శిక్ష పడాలని నిరసన చేసిన విద్యార్థుల పట్ల పోలీసులు అంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లోక్ సభలో మంగళవారం ‘యాంటీ పేపర్ లీక్’ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. ‘‘విద్యార్థులపై పెల్లెట్ గన్స్, టియర్ గ్యాస్, వాటర్ కేనన్, ఏకే 47 ఉపయోగించాల్సిన అవసరమేంటి.. దేశ యువతపై ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరించారు.
విద్యార్థినుల దుస్తులు చింపి వారిని అవమానించడమేంటి.. విచక్షణారహితంగా వారిని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. నిరసన చేస్తున్నది విద్యార్థులా లేక టెర్రరిస్టులు అనుకున్నారా? అసలు వాటిని వాడాలని ఆదేశాలు ఎవరిచ్చారు?” అని ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ ప్రశ్నలు అడగట్లేదని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు.. యావత్ దేశం అడుగుతోందన్నారు.
వీటికి సమాధానం తెలుసుకోవాలని దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, వీటికి ఎవరు జవాబు చెబుతారు ప్రధాని మోదీనా లేక కేంద్ర హోంమంత్రి అమిత్ షానా.. అనేది తెలుసుకోవాలని భావిస్తున్నట్లు ప్రియాంక తెలిపారు.
యువత గొంతు నొక్కే హక్కు మీకు ఎవరిచ్చారు?
అసలు కేంద్రం మన దేశ యువతకు ఎందుకు భయపడుతోందని, వారి గొంతును అణచివేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రియాంక గాంధీ నిలదీశారు. నీట్ పేపర్ లీక్ ఘటనతో విద్యార్థులు తాము అనుభవించిన వేదనను చెప్పుకునేందుకు వేలాదిగా వీధుల్లోకి వచ్చారని అన్నారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా నిరసన చేపట్టిన వారిపై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, పార్లమెంట్ మకర ద్వారం వద్ద సోమవారం ధర్మేంద్ర ప్రధాన్‌కు వెల్కమ్ చెబుతూ బీజేపీ ఎంపీలు చేసిన హడావుడిపై తీవ్రంగా మండిపడ్డారు. అవమానకరరీతిలో తన పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు జిందాబాద్ కొట్టడం, విజయసంకేతాలు చేయడం అత్యంత దురదృష్టకరమని ప్రియాంక గాంధీ విమర్శించారు.
