- కేరళకు ఇచ్చిన రుణాన్ని గ్రాంటుగా పరిగణించండి
- ప్రధానికి ప్రియాంకా గాంధీ లేఖ
వయనాడ్: కేరళలోని వయనాడ్ నియోజకవర్గం ముండక్కై- చూరల్మలకు చెందిన కొండచరియల బాధితులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఈ విషయంపై నరేంద్ర మోదీకి ఆమె మరోమారు లేఖ రాశారు. అలాగే, కేంద్రం ఇచ్చిన విపత్తు సహాయ రుణాలను గ్రాంట్‌లుగా మార్చాలని ఆమె కోరారు. ఈ విషయంలో ప్రధానికి ఆమె రాసిన లేఖను శనివారం కాంగ్రెస్‌పార్టీ విడుదల చేసింది.
వయనాడ్ లోని ముండక్కై, చూరల్మలలో కొండచరియలు విరిగిపడిన తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నారు. దీంతో కేరళకు చెందిన ఎంపీలు డిసెంబర్ 2024లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వ్యక్తిగతంగా సమావేశమై సహాయం చేయాలని కోరారు.
ఆ తర్వాత 2025 ఫిబ్రవరిలో ప్రధానమంత్రికి ప్రియాంక గాంధీ లేఖ రాశారు. కొండచరియలు విరిగిపడిన ఆరు నెలల తర్వాత పునరావాసం కోసం డబ్బును రుణంగా ఇవ్వడం అన్యాయం, అమానవీయమని పేర్కొన్నారు.
ఈ విపత్తులో జీవనోపాధి కోల్పోయిన జీపు, ఆటోరిక్షా డ్రైవర్లు, చిన్న వ్యాపారులు, హోమ్‌స్టే నిర్వాహకుల రుణాలను మాఫీ చేయాలని కూడా ఆమె ప్రధానిని అభ్యర్థించారు. గతేడాది అక్టోబర్‌లో ఆమె మరో లేఖను రాశారు.
