30న మహిళా డిక్లరేషన్!.. కొల్లాపూర్​ సభలో ప్రకటించనున్న ప్రియాంక

30న మహిళా డిక్లరేషన్!.. కొల్లాపూర్​ సభలో ప్రకటించనున్న ప్రియాంక
  • కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఇంట్లోఠాక్రే, రేవంత్ ​సహా కాంగ్రెస్​ ముఖ్యనేతల భేటీ
  •    మహిళా డిక్లరేషన్​, బీసీ డిక్లరేషన్​ తదితర అంశాలపై చర్చ 
  •    కర్నాటకలో మాదిరిగా మహిళలకు రూ. 2 వేల పింఛన్!
  •     బీఆర్​ఎస్​ విధానాలను జనంలో ఎండగట్టేందుకు యాక్షన్​ ప్లాన్​
  •     నేతలంతా కలిసి బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయం!
  •     ఎల్లుండి పీఏసీ సమావేశం

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్​ ముఖ్య నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల రోడ్​ మ్యాప్​ను సిద్ధం చేసే దిశగా చర్చలు జరిపారు. ఈ నెల 30న కొల్లాపూర్​లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా మహిళా డిక్లరేషన్​ను ప్రకటించాలనే విషయంపై చర్చించారు. బుధవారం హైదరాబాద్​లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఇంట్లో దాదాపు మూడున్నర గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​రావు ఠాక్రే, పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్​ కుమార్​, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, సీనియర్​ నేతలు జానారెడ్డి, షబ్బీర్​ అలీ, అంజన్​ కుమార్​ యాదవ్​, దామోదర రాజనర్సింహ, మహేశ్​కుమార్​ గౌడ్​, పొన్నాల లక్ష్మయ్యతో పాటు బీఆర్​ఎస్​ మాజీ నేత జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కర్నాటక తరహాలోనే ముందుకెళ్లాలని సమావేశంలో తీర్మానించామని నేతలు చెప్తున్నారు. మహిళా డిక్లరేషన్​, బీసీ డిక్లరేషన్​, చేరికలు, రాష్ట్ర సర్కార్​ ఫెయిల్యూర్స్​ తదితర అంశాలపై చర్చించారు. సమావేశానికి పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధు యాష్కీ, ఏఐసీసీ ఇన్​చార్జ్​ కార్యదర్శులు పీసీ విష్ణునాథ్​, మన్సూర్​ అలీ ఖాన్​ హాజరు కాలేదు. వాళ్లు బెంగళూరులో ఉన్నందున వాళ్లొచ్చాక శనివారం పొలిటికల్​ అఫైర్స్​ కమిటీ (పీఏసీ) మీటింగ్​ను నిర్వహించనున్నారు.

రూ. 2 వేల పింఛన్ స్కీమ్​ తరహాలో

ఈ నెల 30న కొల్లాపూర్​లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్​ నేతలు తెలిపారు. ఈ సభలో  ప్రియాంకా గాంధీ మహిళా డిక్లరేషన్​ను ప్రకటిస్తారని వారు అంటున్నారు. వాస్తవానికి గురువారమే కొల్లాపూర్​లో సభ జరగాల్సి ఉండగా.. వర్షాల కారణంగా ఈ నెల 30కి వాయిదా వేశారు. సభ, మహిళా డిక్లరేషన్​పై బుధవారం నాటి సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. కర్నాటకలో మహిళల కోసం గృహలక్ష్మి పథకంలో భాగంగా నెలకు రూ. 2వేల పింఛన్​ను అమలు చేస్తున్నారు. అలాంటి పథకాన్ని ఇక్కడ కూడా తాము అధికారంలోకి వస్తే అమలు చేయాలని భేటీలో నేతలు చర్చించినట్లు తెలిసింది. బీసీలకు సీట్ల కేటాయింపుపైనా చర్చించినట్టు నేతలు చెప్తున్నారు. దీంతోపాటు బీసీ డిక్లరేషన్​ ప్రకటిస్తే అందులో పొందుపరచాల్సిన అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు తెలిసింది. బీసీలకు రాష్ట్ర సర్కారు ఇప్పటికే రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించినందున.. అదే తరహాలో బీసీలకు సాయం ప్రకటించే విషయాన్ని బీసీ డిక్లరేషన్​లో చేర్చే అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం. 

సమస్యలన్నింటిపైనా పోరాటం

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ప్రజాధ్వని యాత్ర పేరిట బస్సు యాత్రను నిర్వహించింది. పే సీఎం క్యాంపెయిన్​ జనాల్లోకి ఎంత బాగా వెళ్లిందో.. ఈ బస్సు యాత్ర ద్వారా కూడా కాంగ్రెస్​కు ఎంతో ప్రయోజనం చేకూరింది. కర్నాటక తరహాలోనే మన రాష్ట్రంలోనూ కాంగ్రెస్​ నేతలంతా కలిసి బస్సు యాత్రను చేపట్టాల్సిందిగా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. 
24 గంటల ఉచిత కరెంట్​ విషయం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.  రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంట్​ ఇవ్వడం లేదనేది సబ్​స్టేషన్లలోని లాగ్​బుక్కులతో తేలిపోయిందని, ఆ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్​ నేతలు భావిస్తున్నారు. మరోవైపు టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ, ఇంటర్​ పరీక్షల్లో గ్లోబరీనా తప్పిదాలతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం, ధరణి తదితర సమస్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సమావేశంలో నేతలు చర్చించినట్లు తెలిసింది. 

గాంధీ భవన్​ను వీడి జనంలోకి

అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు నెలలే ఉన్నందున కీలక నేతలంతా గాంధీభవన్​లోనే కూర్చోకుండా.. జనాల్లోకి వెళ్లేలా యాక్షన్​ ప్లాన్ ను రెడీ చేసుకోవాలని సమావేశంలో చర్చించారు. నేతలంతా వీలైనంత ఎక్కువగా తమ తమ నియోజకవర్గాల్లో తిరిగి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. భేదాభిప్రాయాలను పక్కనపెట్టేసి.. కలసికట్టుగా ముందుకు వెళ్లాలన్న అభిప్రాయాన్ని నేతలు వెల్లడించినట్టు తెలిసింది. మరోవైపు చేరికల అంశం కూడా సమావేశంలో చర్చించినట్టు సమాచారం.