మార్చిలో వీసీ సెర్చ్ కమిటీలు..త్వరలో అప్లికేషన్ల స్క్రూటినీ ప్రక్రియ

మార్చిలో వీసీ సెర్చ్ కమిటీలు..త్వరలో అప్లికేషన్ల స్క్రూటినీ ప్రక్రియ
  • యూజీసీ నుంచి నామిని పేర్లు ఖరారు 
  • త్వరలో అప్లికేషన్ల స్క్రూటినీ ప్రక్రియ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీలకు కొత్త వైస్ చాన్స్​లర్ల నియామక ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగియగా త్వరలోనే స్క్రూటినీ ప్రక్రియ ప్రారంభం కానున్నది. సాధ్యమైనంత త్వరగా వీసీల నియామకాలను పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. దీంట్లో భాగంగా మార్చిలో సెర్చ్ కమిటీ సమావేశాలు పెట్టేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, తెలుగు యూనివర్సిటీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, జేఎన్ఏఎఫ్​ఏయూ, మహాత్మా గాంధీ, అంబేద్కర్  ఓపెన్  యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్  తదితర 10 వర్సిటీల్లో వీసీ పోస్టుల కోసం 312 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరు 3, 4 యూనివర్సిటీలకు అప్లై చేసుకోవడంతో 1382 అప్లికేషన్లు వచ్చాయి. వీసీ పోస్టులకు వయో పరిమితి లేకపోవడంతో రిటైర్  అయిన వాళ్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. రెండు, మూడు  వర్సిటీల వీసీలు మినహా, ప్రస్తుతం కొనసాగుతున్న వారంతా మళ్లీ అప్లై చేసుకున్నారు.

అయితే మే నాలుగో వారం వరకూ ప్రస్తుతం ఉన్న వీసీల కాలపరిమితి ఉంది. కానీ, పలువురు వీసీలపై అనేక ఆరోపణల నేపథ్యంలో వారిని తప్పించాలని సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా వీసీల ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తోంది. వచ్చిన అప్లికేషన్లను పరిశీలించేందుకు త్వరలో స్క్రూటినీ కమిటీని సర్కారు నియమించనున్నది. హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్​లో ఆ ప్రక్రియ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నెలాఖరులోపే వీసీల రిక్రూట్ మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది.