ఎవరేమన్నా పట్టించుకోను

ఎవరేమన్నా పట్టించుకోను

వెంకటేష్ హీరోగా నటించిన ‘దృశ్యం 2’ని ఓటీటీకి అమ్మడానికి ఏపీ టికెట్‌‌‌‌ రేట్‌‌‌‌సమస్య కూడా ఒక కారణమేనంటున్నారు సురేష్‌‌‌‌ బాబు. ఆంటోనీ పెరంబవూర్‌, రాజ్‌‌‌‌కుమార్‌‌‌సేతుపతిలతో కలసి ఆయన నిర్మించిన ఈ చిత్రం ఇటీవల అమెజాన్‌‌‌‌ప్రైమ్‌‌‌‌లో రిలీజయ్యింది. ఈ సందర్భంగా సురేష్‌‌‌‌ బాబు కాసేపు ఇలా ముచ్చటించారు.

‘మలయాళంలో హిట్ కాగానే ఈ సినిమా రైట్స్‌‌‌‌ తీసుకున్నాం. జీతూ స్క్రిప్ట్ పంపించాక కొన్ని మార్పులూ చేర్పులూ చెప్పాను. వెంటనే షూటింగ్ మొదలుపెట్టాం. హైదరాబాద్‌‌‌‌తో పాటు కేరళలోనూ తీశాం. కరోనా భయంతో నేను మాత్రం సెట్‌‌‌‌కి వెళ్లలేదు. ఇది కమర్షియల్ సినిమా కాదు. పాటలు, ఫైట్లు ఉండే సినిమాలను థియేటర్లో చూస్తే మంచి కిక్ వస్తుంది. ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేసినా ఈ రేటింగే వచ్చేది. కానీ కలెక్షన్లు ఎంత వస్తాయనేది మాత్రం చెప్పలేం. ఓటీటీ అనేది ఫైనాన్షియల్‌‌‌‌గా సేఫ్. అందుకే అటు వెళ్లాం. ఏపీలో టికెట్ల రేట్ల సమస్య కూడా ఈ సినిమాను ఓటీటీకి అమ్మడానికి ఒక కారణం. ఏ క్లాస్‌‌‌‌లో టికెట్ రేటు వంద రూపాయలంటే పర్లేదు. కానీ బీ, సీ సెంటర్లలో మరీ ఇరవై, ముప్ఫై రూపాయలంటే చాలా నష్టం వస్తుంది. అది సరైన నిర్ణయం కాదు. ప్రభుత్వంతో ఎక్కడో మిస్ కమ్యునికేషన్ జరుగుతోందనిపిస్తోంది. తన ప్రొడక్ట్‌‌‌ను ఎంత రేటుకు అమ్ముకోవాలనే హక్కు నిర్మాతకి కూడా ఉంటుంది’ అని సురేశ్ బాబు అన్నారు. 

‘ఈ పదిహేను నెలల్లో మాకు కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ చేసిందేమీ లేదు. థియేటర్ల కరెంట్ బిల్లులు కూడా మాఫీ చేయలేదు. థియేటర్ల ఓనర్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. థియేటర్లో సినిమా చూస్తే వచ్చే ఎక్స్‌‌‌‌పీరియన్స్ వేరు. అఖండ, పుష్ప వంటి చిత్రాలకు ఆడియెన్స్ కచ్చితంగా వస్తారు. పండుగలకు మాత్రమే జనాలు థియేటర్లకు వస్తున్నారని అందరికీ అర్థమైంది. అందుకే ఫెస్టివల్ సీజన్‌‌‌‌కు రావాలని ఫిక్సయ్యారు. ఒకప్పుడు నాలుగొందల స్క్రీన్స్‌‌‌‌ చొప్పున నాలుగు చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకీ పదిహేనొందల స్క్రీన్స్‌‌‌‌ కావాలంటున్నారు. అక్కడే గొడవ వస్తోంది. ఈ సంక్రాంతికి ఏం జరుగుతుందో?’ అని సురేశ్ బాబు చెప్పారు.  

‘సినిమా ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగాను. నేనేం చేసినా కూడా సినిమా పరిశ్రమ కోసమే చేస్తాను. ఎవరో ఏదో అన్నారని నేను పట్టించుకోను. నేను బిజినెస్ చేస్తున్నాను. డబ్బు జెనరేట్ చేయాలి. ప్రొడక్షన్ కంపెనీ నడపాలి. థియేటర్లను చూసుకోవాలి. అందుకే శాకిని డాకిని, దొంగలున్నారు జాగ్రత్త, డ్యాన్సింగ్ క్వీన్ సినిమాల్ని ఓటీటీకి ఇచ్చేశాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్‌‌‌‌లు సెట్స్ మీదున్నాయి. వెంకటేష్ హీరోగా రానా నాయుడు, ఎఫ్ 3 కాకుండా ఇంకొన్ని రెడీ అవుతున్నాయి. రివీల్ చేశాక సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ అవుతారు. విరాటపర్వం ఇంకా ఐదు రోజుల షూట్ బ్యాలన్స్ ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు’ అని సురేశ్ బాబు పేర్కొన్నారు.