V6 News

దేశభక్తి, జాతీయవాదం పేరుతో.. క్లాస్రూమ్లోకి హిందూ మతతత్వం

దేశభక్తి, జాతీయవాదం పేరుతో.. క్లాస్రూమ్లోకి హిందూ మతతత్వం
  • విద్యా కాషాయీకరణకు కుట్రలు
  • టీపీటీఎఫ్ సదస్సులో ప్రొ.హరగోపాల్ మండిపాటు
  • ప్రభుత్వ విద్యను బతికించుకుందాం: ఎమ్మెల్సీ కోదండరాం పిలుపు

ముషీరాబాద్, వెలుగు: భారతదేశం లౌకిక దేశమని మరచి, పాఠ్యపుస్తకాల్లో మత భావజాలాన్ని చొప్పిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. దేశభక్తి, జాతీయవాదం పేరుతో హిందూ మతతత్వాన్ని తరగతి గదిలో ప్రవేశపెడుతున్నారని, విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ ద్వారా తమ రాజకీయ ఎజెండాను సాధించుకోవడానికి పాలకులు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. గురువారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర విద్యా సదస్సులో ఆయన మాట్లాడారు.

రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి, దేశాన్ని మనువాదం వైపు మళ్లించే కుట్రలను అభ్యుదయవాదులు అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్య ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, దానిని కాపాడటానికి ప్రగతిశీల సంఘాలు ముందుకు రావాలని కోరారు.

టీపీటీఎఫ్ అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యా వ్యవస్థను రద్దు చేసి, ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్​గా మార్చాలని, అసమానతలు లేని శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కాసిం, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో పాటు పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.