వ్యవస్థను బలి చేస్తే.. ప్రభుత్వ మనుగడ కష్టం.

వ్యవస్థను బలి చేస్తే.. ప్రభుత్వ మనుగడ కష్టం.
  • వ్యవస్థ మారనంత కాలం రాజకీయ పెత్తనం చేస్తారు
  • అవినీతి ఆగాలంటే వ్యక్తిగత నిజాయతీ ఉండాలి
  • ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు సరికాదు

వ్యవస్థ మారనంత కాలం అధికారులపై రాజకీయ నేతలు పెత్తనం చేస్తారని, ఉద్యోగుల పని సంస్కృతి మారకపోతే ఇబ్బందులు తప్పవని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని  సుందరయ్య విజ్ఞానం కేంద్రంలో  రెవెన్యూ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘రెవెన్యూ సంస్కరణలు- సమస్యలు-సూచనలు’ అంశంపై జరిగిన ఈ చర్చలో నాగేశ్వర్, ఉద్యోగుల సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ, ప్రజలు, ఉద్యోగులకు ఘర్షణ వస్తే, ప్రభుత్వ మనుగడ కష్టమని అన్నారు. రాజకీయ అవినీతి పోకుండా, ఉద్యోగుల అవినీతి నిర్మూలన అసాధ్యమని అన్నారు. అవినీతి ఆగాలంటే వ్యక్తిగత నిజాయతీ ఉండాలని, హితబోధ జరగాలని, ముందుగా రాజకీయ అవినీతిని అంతం చేయాలని అభిప్రాయపడ్డారు.

అవినీతి నిర్ములన అనేది రాజకీయ అవినీతి నుంచే ప్రారంభం కావాలని, దాన్ని తొలగించకుండా ఉద్యోగులపై నెపం నెట్టే ప్రయత్నం సరికాదని ఆయన అన్నారు. ఈ రాజకీయ అవినీతిని ముఖ్యమంత్రి అంతం చేయాలని నాగేశ్వర్ అభిప్రాయ పడ్డారు.

మొత్తం వ్యవస్థనే సంస్కరించాలి.

రెవెన్యూ వ్యవస్థలో దళారులు ఎక్కువై వ్యవస్థను భ్రష్టు పట్టించారు కానీ, ఉద్యోగులు అవినీతి పరులు కాదని రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు మఠం శివ శంకర్ అన్నారు. 35 సంవత్సరాల నుంచి రెవెన్యూలో తప్పులు జరుగుతూ వస్తున్నాయని, మొత్తం రెవెన్యూ శాఖను సంస్కరించాలని ఆయన అన్నారు.

ప్రతి ఒక్కరూ సీఎం కు ఫోన్ చేయలేరు.

టెక్నాలజీని ఉపయోగించుకుంటే రెవెన్యూ అధికారులపై ఉన్న అపవాదు కొంతైనా తొలుగుతుందని  ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు టీ.వివేక్ అన్నారు. ప్రస్తుతం ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉందని అన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై, ప్రతి ఒక్కరు సిఎంకు ఫోన్ చేయలేరని ఆయన అన్నారు. రాష్ట్రంలో లోకాయుక్త, విజిలెన్స్ కమీషన్ తదితర వ్యవస్థలకు అధికారులు లేరని, అందుకు తగిన యంత్రాంగాన్ని నియమించాలని కోరారు. కొత్త రెవెన్యూ చట్ట రూపకల్పనలో కన్సల్టెంటివ్ ప్రాసెస్ లో రెవెన్యూ అధికారులు భాగస్వాములు కావాలని ఆయన అన్నారు.