రవీంద్రభారతి, వెలుగు: రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడేందుకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఏర్పాటైందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావ సభ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వీసీ చక్రపాణి మాట్లాడుతూ గతం,- వర్తమానం-, భవిష్యత్తును ఆవిష్కరించే ఆత్మనే అస్తిత్వం ఈ వేదిక అని అన్నారు. ఈ వేదిక ద్వారా తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భవిష్యత్తు తరాలకు చేరేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.
సీనియర్ జర్నలిస్టు అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వం నిలవాలంటే తెలంగాణ భాష, యాస, సంస్కృతి కొనసాగాలన్నారు. తెలంగాణ అస్తిత్వ వేదిక కో–ఆర్డినేటర్ శ్రీధర్ రావు దేశ్‌పాండే మాట్లాడుతూ.. తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అసత్య ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల కృషిని డాక్యుమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు వెంకట్ నారాయణకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం చేశారు. తెలంగాణ అస్తిత్వంపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

