
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరగని నిర్బంధాలు, నిషేధాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో జరుగుతున్నాయని పౌరహక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే పౌరుల హక్కులు మెరుగుపడుతాయని తామంతా భావించామని, కానీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. హైదరాబాద్ హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో తెలంగాణ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు.
తెలంగాణలో ఉద్యమ పోరాటాలు, త్యాగాలు చేసిన అనుభవాలు ఉన్నప్పటికీ.. గత10 ఏళ్లలో పౌర, ప్రజాస్వామ్య హక్కులను పాలకులు అణిచివేశారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ హరగోపాల్. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదన్నారు. అధికారాన్ని తన చేతులో ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖునీ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఊపా చట్టం దుర్వినియోగం అవుతోందని, పోలీసుల చేతికి అధికారం ఇవ్వడంతో వాళ్లు ఇష్టానుసారంగా చట్టాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందామనుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులో ఉండరని, హోంమంత్రికి చెప్పినా ఉపయోగం లేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... ఓట్ల కోసం వచ్చే నాయకులను పౌర, ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.