
హైదరాబాద్: వీకెండ్ వస్తే చాలు.. మద్యం ప్రియులు బార్లు, పబ్లకు క్యూ కడుతుంటారు. మెరిసేదంతా బంగారం కానట్టే తాగేదంతా ప్యూర్ లిక్కర్ కాదు. ప్రీమియం లిక్కర్ అంతకన్నా కాదు. ఖాళీ అయిన కాస్టీ విస్కీ బాటిల్స్లో చీప్ లిక్కర్ మిక్స్ చేసి అమ్ముతున్న ఇద్దరిని మాదాపూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ట్రూప్స్ బార్లో ఈ కల్తీ మద్యం బాగోతం వెలుగులోకి వచ్చింది. మద్యం కల్తీ చేస్తున్న వి సత్యనారాయణ రెడ్డి, పునీత్ పట్నాయక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడుల్లో ఈ విషయం బయటపడింది.
Two persons were arrested from Madhapur on Friday, April 25 for adulterating liquor at a bar.
— The Siasat Daily (@TheSiasatDaily) April 25, 2025
The accused were seen mixing cheap liquor with expensive liquor by removing the seal of liquor bottles in the bar. They were caught mixing Jameson liquor worth Rs 2690 with Oaksmith… pic.twitter.com/lFu1h8bbIE
2వేల 690 రూపాయల విలువైన జెమిసన్ లిక్కర్ బాటిల్లో వెయ్యి రూపాయల ఖరీదైన ఓక్ స్మిత్ లిక్కర్ మిక్స్ చేస్తున్న సమయంలో ఈ కల్తీ గాళ్లు ఎక్సైజ్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. చీప్ లిక్కర్తో నింపిన 75 బాటిళ్లను, 55 ఖాళీ బాటిల్స్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. బయట వైన్స్ నుంచి ఖాళీ మద్యం బాటిళ్లను కొనేసి ఈ దందా చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల స్పిరిట్‌తో మద్యాన్ని కల్తీ చేసి బ్రాండెడ్ సీసాల్లో పోసి వైన్స్, బార్లకు సరఫరా చేస్తున్న ముఠా బాగోతం నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది.
నిందితులు కల్తీ మద్యం తయారీకి బ్రాండెడ్ కంపెనీలను ఎంచుకుంటున్నారు. ముందుగా వైన్స్, బార్ల నుంచి బ్లెండర్స్ ప్రైడ్, టీచర్స్, బ్లాక్ లేబుల్, జానీవాకర్, బ్లాక్‌డాగ్ వంటి ఖరీదైన బాటిళ్లను సేకరిస్తున్నారు. వాటిల్లో కొంత మేర మద్యాన్ని తీసి ఆ ప్లేస్‌ను కర్నాటక నుంచి తెప్పించిన ఆర్డినరీ లిక్కర్‌తో నింపేస్తున్నారు. కలర్‌లో తేడా రాకుండా వాటర్, స్పిరిట్ మిక్స్ చేస్తున్నారు.
బాటిళ్లపై మూతలను తొలగించేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎక్స్‌పర్ట్స్‌ను తీసుకొచ్చి వారికి రోజుకు 8 గంటల పాటు పని కల్పిస్తున్నారు. మూతలు తొలగించినందుకు వారికి భారీ మొత్తంలోనే చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇలా తయారు చేసిన నకిలీ మద్యాన్ని చండూరు, నాంపల్లి, మునుగోడు ప్రాంతాల్లోని వైన్స్, బెల్ట్‌షాపులకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. రూ.1,200 విలువైన బాటిల్‌ను రూ. 700కు, రూ. 2 వేలు ఖరీదు చేసే బాటిల్‌ను రూ.1,200 కే ఇస్తుండడంతో లిక్కర్ వ్యాపారులు, బెల్ట్ షాప్ నిర్వాహకులు ఈ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.