గుజరాత్‌ జడ్జీల పదోన్నతులపై సుప్రీంకోర్టు స్టే

గుజరాత్‌ జడ్జీల పదోన్నతులపై సుప్రీంకోర్టు  స్టే

న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్  నేత రాహుల్  గాంధీని దోషిగా తేల్చిన సూరత్  చీఫ్​ జ్యుడీషియల్  మేజిస్ట్రేట్  హరీశ్  హస్ముఖ్ భాయ్  వర్మ తో పాటు గుజరాత్​కు చెందిన మరో 67 మంది కింది స్థాయి జ్యుడీషియల్  అధికారుల ప్రమోషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. గుజరాత్  స్టేట్  జ్యుడీషియల్  సర్వీస్‌‌ నిబంధనలు 2005ను ఉల్లంఘించి వారికి ప్రమోషన్లు ఇచ్చారని జస్టిస్  ఎంఆర్  షా, జస్టిస్  సీటీ రవికుమార్​ల బెంచ్ పేర్కొంది. మెరిట్  కమ్ సీనియారిటీ, పరీక్షలో పాస్  అర్హతల ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలన్న నిబంధనలను ఉల్లంఘించారని బెంచ్  తెలిపింది. ‘‘వివాదాస్పద లిస్టును హైకోర్టు జారీ చేయడాన్ని హర్షిస్తున్నాం. అయితే జిల్లా జడ్జిలకు ప్రమోషన్లు కల్పిస్తూ గుజరాత్  రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధం. కోర్టు తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరించింది. 

ఈ నేపథ్యంలో ప్రమోషన్ల లిస్టుపై స్టే విధిస్తున్నాం. ఆ లిస్టులో పేరు ఉన్న అధికారులను తిరిగి వారి పాత పోస్టులకు పంపించాలి” అని బెంచ్  వెల్లడించింది. జస్టిస్  షా ఈ నెల 15న రిటైర్ట్  అవుతున్నందున ఈ కేసుపై మరొక బెంచ్​తో విచారణ జరిపించాలని బెంచ్ ఆదేశించింది. 68 మంది జ్యుడీషియల్  అధికారులను హయ్యర్  కేడర్​కు ప్రమోట్  చేయడాన్ని సవాలు చేస్తూ సీనియర్  సివిల్  జడ్జి కేడర్  అధికారులు రవి కుమార్  మహీతా, సచిన్  ప్రతాప్ రాయ్  మెహతా వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు బెంచ్  శుక్రవారం విచారణ జరిపింది. వారికి ప్రమోషన్లు కల్పించాలన్న గుజరాత్  ప్రభుత్వ నిర్ణయంపై బెంచ్  సీరియస్  అయింది. ప్రమోషన్లు కల్పించాలన్న నిర్ణయంపై వివరణ ఇవ్వాలని గుజరాత్  ప్రభుత్వంతో పాటు రిజిస్ట్రార్  జనరల్  ఆఫ్ ది గుజరాత్  హైకోర్టుకు గత నెల 13న బెంచ్  నోటీసులు పంపింది. ఈ కేసు పెండింగ్​లో ఉన్న విషయం తెలిసి కూడా 68 మంది అధికారులకు ఏప్రిల్ 18న ప్రమోషన్లు ఇవ్వడం దురదృష్టకరమని బెంచ్ వ్యాఖ్యానించింది. 

కేసు పెండింగ్​లో ఉండగానే  ఎలా నిర్ణయం తీసుకుంటారు?

‘‘ప్రమోషన్ల కేసు మా దగ్గర పెండింగ్  లో ఉన్నప్పుడే ప్రమోషన్ల ఆర్డర్లను గుజరాత్  ప్రభుత్వం ఆమోదించి ఉత్తర్వులు జారీచేసిన విధానం చాలా తొందరపాటు చర్య. అలాంటి చర్యను మేము సమర్థించం. ప్రమోషన్లు కల్పిస్తూ అంత అర్జెంట్​గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది కోర్టు ప్రక్రియ, కార్యకలాపాలను ఉల్లంఘించడమే” అని బెంచ్  వ్యాఖ్యానించింది. కేసు పెండింగ్​లో ఉన్నప్పుడే ప్రమోషన్లు కల్పిస్తూ ఏప్రిల్ 18వ తేదీ జారీ చేసిన ఉత్తర్వులపై గుజరాత్  ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బెంచ్ ఆదేశించింది. అలాగే సీనియర్ కం మెరిట్ ఆధారంగా ప్రమోషన్లు ఇచ్చారో లేదో  వివరణ ఇవ్వాలని, దాంతోపాటు మెరిట్ లిస్టును కూడా సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌‌కు సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది.