
గండిపేట, వెలుగు: ఆస్తి తగాదాలతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ అర్బాజ్(31), చింతల్మెంట్కు చెందిన మొహమ్మద్ అజ్జు(23), అత్తాపూర్‌కు చెందిన సులేమాన్‌ఖాన్(25) సమీప బంధువులు. వీరికి తాతల తరఫున కర్నాటక రాష్ట్రంలోని బాల్కి దుగుల్లుండి గ్రామంలో ఆస్తులున్నాయి. వాటి విషయంలో తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో అర్బాజ్‌ను హతమార్చాలని మిగతా ఇద్దరు పథకం పన్నారు.
బుధవారం ఉదయం అర్బాజ్‌ను కారులోకి బలవంతంగా కూర్చోబెట్టుకున్నారు. సులేమాన్కాన్ కారు నడుపుతుండగా అర్బాజ్ ముందు సీటులో ఉన్నాడు. వెనక సీటులో ఉన్న అజ్జు కత్తితో అర్బాజ్‌పై దాడి చేశారు. మెడపై విచక్షణారహితంగా పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డెడ్‌బాడీని ఏజీ కాలేజీ ప్రధాన ద్వారం దగ్గర పడేసి పారిపోయారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బలెనో కారు, రెండు సెల్‌ఫోన్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు.