అదానీ వ్యవహారంపై దద్దరిల్లిన పార్లమెంట్

అదానీ వ్యవహారంపై దద్దరిల్లిన పార్లమెంట్
  • కాంగ్రెస్​ ఎంపీ అనర్హత, అదానీ వ్యవహారంపై దద్దరిల్లిన పార్లమెంట్

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు దద్దరిల్లింది. మొదలైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తిరిగి సమావేశమైనా ఇదే పరిస్థితి. రాహుల్‌‌ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా, అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. నల్ల దుస్తుల్లో వచ్చిన అపొజిషన్ మెంబర్లు వెల్‌‌లోకి వెళ్లి నినాదాలతో హోరెత్తించారు. గత వారం ఎలాంటి చర్చ జరగకుండానే ఫైనాన్స్ బిల్లును లోక్‌‌సభ ఆమోదించగా..సోమవారం కూడా ఎలాంటి చర్చ జరపకుండానే రాజ్యసభ తిప్పిపంపింది. రాజ్యసభ ప్రతిపాదించిన సవరణ చేసిన తర్వాత ఫైనాన్స్ బిల్లును ఆమోదించినట్లు లోక్‌‌సభ ప్రకటించింది.

ఈడీ.. భయపడవద్దు..

ఉదయం లోక్‌‌సభ ప్రారంభం కాగానే.. కాంగ్రెస్ సభ్యులు వెల్‌‌లోకి దూసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని వెళ్లిన కాంగ్రెస్ సభ్యులు టీఎన్ ప్రతాపన్, హిబి ఈడెన్.. స్పీకర్‌‌‌‌పైకి పేపర్లు విసిరారు. దీంతో సభ ప్రారంభమైన నిమిషంలోపే వాయిదా పడింది. ‘ఈడీ భయపడవద్దు.. అదానీపై రెయిడ్స్ చెయ్యి’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ నల్ల కండువా వేసుకోగా, మిగతా నేతలు నలుపు షర్ట్‌‌లు వేసుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా నల్ల కుర్తా తొడుక్కున్నారు. ‘‘సభ గౌరవంతో నడవాలని నేను కోరుకుంటున్నా. సభను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేస్తున్నా” అని ఓం బిర్లా ప్రకటించారు. 

ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చే జరగలే

రాజ్యసభలోనూ రభస కొనసాగింది. అదానీ అంశంపై ప్రతిపక్ష ఎంపీలు నిరసనలు కొనసాగించడంతో సభను వాయిదా వేశారు. చైర్మన్ జగదీప్‌‌ ధన్‌‌కర్ తన చైర్‌‌‌‌లో కూడా కూర్చోకముందే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు మొదలుపెట్టారు. ‘మోడీ అదానీ భాయ్‌‌ భాయ్’ అంటూ స్లోగన్లు ఇచ్చారు. దీంతో సభను మరోసారి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. మరోవైపు ఫైనాన్స్ బిల్లు-2023ని ఓ సవరణతో లోక్‌‌సభకు రాజ్యసభ తిప్పిపంపింది. జమ్మూకాశ్మీర్ బడ్జెట్, ఇతర బిల్లులను కూడా ఎలాంటి చర్చ చేపట్టకుండానే లోక్‌‌సభకు పంపింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత తిరిగి సభ సమావేశం కాగానే.. బిల్లులను తిప్పిపంపే ప్రక్రియను చైర్మన్ ధన్‌‌కర్ ప్రారంభించారు. ఆర్థిక బిల్లును చర్చకు ప్రతిపాదిస్తూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెక్యూరిటీల లావాదేవీల పన్ను రేట్లను సరిచేయడానికి సవరణను ప్రవేశపెట్టారు. దీనిపై చర్చకు చైర్మన్ ఆహ్వానించారు. కానీ నిరసనలు కొనసాగాయి. దీంతో బిల్లులను తిప్పిపంపేందుకు ఆమోదం తెలిపారు. తర్వాత రాజ్యసభ సూచించిన సవరణను లోక్‌‌సభ ఆమోదించింది.

ప్రతిపక్షాల ర్యాలీ

రాహుల్‌‌పై అనర్హత వేటు, అదానీ వ్యవ హారంపై ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్ల దుస్తుల్లో వచ్చిన ప్రతిపక్ష ఎంపీలు పార్ల మెంట్ నుంచి విజయ్ చౌక్ దాకా ర్యాలీ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పార్లమెంట్ కాంప్లెక్స్‌‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనలు తెలిపారు. ‘సత్యమేవ జయతే’ అనే భారీ బ్యానర్‌‌‌‌తో, ‘సేవ్ డెమోక్రసీ’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని విజయ్‌‌ చౌక్‌‌కు చేరుకున్నారు. అక్కడ బైఠాయించారు. ‘‘కొన్నేండ్లలోనే అదానీ సంపద అంతలా ఎలా పెరిగింది? ఈ వ్యవహారంపై జేపీసీ వేయాలని మేం డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అంగీకరించట్లేదు?” అని ఖర్గే ప్రశ్నించారు. ‘‘రాహుల్​ను అప్రతిష్టపాలు చేయాలని మీరు కోరుకున్నారు. కర్నాటకలో కామెంట్లు చేస్తే.. గుజరాత్‌‌కు కేసును బదిలీ చేసింది అందుకే. ప్రజాస్వామ్యంలో ఈ రోజు బ్లాక్ డే” అని అన్నారు. డెమోక్రసీని ప్రధాని చంపేస్తున్నందుకే తాము నల్ల డ్రెస్‌‌లో వచ్చామని ఖర్గే అన్నారు.

గాడిదతో గుర్రపు రేసుకా?: కేంద్ర మంత్రి హర్‌‌‌‌దీప్

‘‘వీర్ సావర్కర్ గురించి మాట్లాడటానికి బదులు.. కోర్టు తీసుకున్న చర్యలపై కోర్టులో పోరాడండి. మీరు గుర్రపు రేసులో పాల్గొనేందుకు గాడిదను తీసుకెళ్తున్నారు” అని కేంద్ర మంత్రి హర్‌‌‌‌దీప్ సింగ్ పురి ఎద్దేవా చేశారు. ‘‘మీరు నిజంగా కొంత ఆత్మపరిశీలన చేసుకోవడానికి అర్హులు. భారతదేశ ప్రజలు మీకు సరైన తీర్పు చెబుతారు. కోర్టు చర్యపై కోర్టులో పోరాడండి. దాన్ని వదిలి మీరు మహాభారతం, సావర్కర్‌‌ గురించి మాట్లాడుతున్నారు” అని అన్నారు.