యాదాద్రి ప్లాంట్లో  ఔట్సోర్సింగ్ లొల్లి!..టెండర్లు రద్దు చేయాలంటూ ఆందోళనలు 

యాదాద్రి ప్లాంట్లో  ఔట్సోర్సింగ్ లొల్లి!..టెండర్లు రద్దు చేయాలంటూ ఆందోళనలు 
  • కోల్​ హ్యాండ్లింగ్​, యాష్​ హ్యాండ్లింగ్​ ప్లాంట్లలో 1,913 మంది పోస్టులు ఔట్​సోర్సింగ్​
  • ఇటీవల టెండర్లు పిలిచిన  జెన్​కో
  • ఇతర రాష్ట్రాల ఏజెన్సీలు దక్కించుకుంటే స్థానికుల ఉపాధికి గండి
  • తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం చేయడమేనంటూ విద్యుత్ ​ఉద్యోగుల ఫైర్​
  • టెండర్లు రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘాల ఆందోళన బాట 

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్​పవర్ స్టేషన్​(వైటీపీఎస్​)లో ‘ఔట్​ సోర్సింగ్’ లొల్లి ముదురుతున్నది. జెన్​కో నిర్వహణలో ఉన్న ఈ స్టేషన్​లోని కోల్​ హ్యాండ్లింగ్, యాష్​ హ్యాండ్లింగ్​ ప్లాంట్ల లో 1,913 ఉద్యోగులను ఔట్​సోర్సింగ్​పై నియమించుకునేందుకు ఏజెన్సీ కోసం  జెన్​కో  ఇటీవల టెండర్లు పిలిచింది. దీనిపై విద్యుత్​ ఉద్యోగసంఘాలు భగ్గుమన్నాయి. ప్లాంట్​కోసం భూములిచ్చిన నిర్వాసితులు, స్థానికుల ఉపాధికి గండికొట్టేలా ఉన్న టెండర్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇందులో భాగంగానే జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. గురువారం జెన్​కో డైరెక్టర్​కు వినతిపత్రం ఇవ్వగా.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పవర్ ప్లాంట్లలో నల్ల బ్యాడ్జీలతో విద్యుత్​ ఉద్యోగులు నిరసన తెలిపారు. టెండర్లు రద్దు చేయకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

స్థానికుల ఉపాధికి గండికొడ్తున్నారని ఉద్యోగ సంఘాల ఫైర్​

రాష్ట్రంలో ఎన్నడూలేనిది జెన్​కో  నిర్వహించే పవర్​ ప్లాంట్లలో ప్రైవేట్​ టెండర్లను పిలిచే కొత్త సంప్రదాయంపై విద్యుత్​ శాఖలోని ఉద్యోగ సంఘాలు ఫైర్​ అవుతున్నాయి. జెన్​కోను ప్రైవేట్​ పరం చేసే యోచనలో భాగంగానే యాదాద్రి కోల్​ హ్యాండ్లింగ్, యాష్​ హ్యాండ్లింగ్​ ప్లాంట్లలో ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులను నియమించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. కాగా, జెన్​కో పిలిచిన టెండర్ల ప్రకారం.. హై స్కిల్డ్​ విభాగంలో 216, స్కిల్డ్​ 444, సెమీ స్కిల్డ్​ 419, అన్ స్కిల్డ్​ విభాగంలో 834 మందిని నియమించనున్నారు.

వీరికి ఒక్కొక్కరికి రూ.25 వేల  నుంచి రూ.50 వేల  వరకు  జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ, యాదాద్రి పవర్​ ప్లాంట్​కు భూములిచ్చిన సమయంలో అన్​స్కిల్డ్​పోస్టులను భూ నిర్వాసితుల కుటుంబాలు, స్థానిక యువత, నిరుద్యోగులకు ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ మాట నిలుపుకోవాలని ఉద్యోగసంఘాల నేతలు సూచిస్తున్నారు. అలాగే, స్కిల్డ్​ పోస్టులకు జెన్​కో నోటిఫికేషన్​ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వేలాది మంది నిరుద్యోగ ఇంజినీర్లు, ఐటీఐ అభ్యర్థులతో భర్తీ చేయవచ్చని చెప్తున్నారు.

ఇవన్నీ పక్కనపెట్టి కొత్తగా ప్రైవేట్​ టెండర్లు పిలవడం సమంజసం కాదన్నారు. జైపూర్​లోని సింగరేణి ప్లాంట్​ మాదిరిగా ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీలు ఈ టెండర్​ దక్కించుకుంటే ఆ రాష్ట్రాల వాళ్లకే ఉద్యోగాలు వెళ్లిపోతాయని, తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని  వివరిస్తున్నారు. 

 1,913 ఔట్​సోర్సింగ్​ ఉద్యోగుల కోసం టెండర్లు 

రాష్ట్రంలో జెన్​కో ఆధ్వర్యంలో  కొత్తగూడెం, చెల్పూర్​, భధ్రాద్రి థర్మల్​ పవర్​ ప్లాంట్లలో 4,080 మెగావాట్ల సామర్థ్యం ఉన్న థర్మల్​ విద్యుత్​ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. వీటికి కొత్తగా యాదాద్రిలో 4 వేల మెగావాట్ల  థర్మల్​ ప్లాంట్​ జతకలిసింది. గతంలో జెన్​కో ఆధ్వర్యంలో నిర్వహించే పవర్​ ప్లాంట్ల ఆపరేషన్​ అండ్​ మేయింటనెన్స్​మొత్తం జెన్​కో ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ వచ్చారు. కానీ, యాదాద్రి థర్మల్​ ప్లాంట్​ విషయంలో మాత్రం  కోల్​ హ్యాండ్లింగ్, యాష్​ హ్యాండ్లింగ్​ ప్లాంట్లలో 1,913 ఔట్​సోర్సింగ్​ ఉద్యోగుల కోసం ఇటీవల టెండర్లు పిలిచారు. మూడేండ్ల కాలానికి రూ.255 కోట్లు చెల్లించేలా ప్రైవేట్​ కంపెనీలు టెండర్లు దాఖలు చేయాలని కోరారు. ఈ నెల 29తో టెండర్​ గడువు ముగుస్తుంది.