- ప్రజలకు డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ భారతి హోళీ కేరి సూచన
ట్యాంక్ బండ్, వెలుగు: జనగణనలో ప్రజలు కచ్చితమైన వివరాలు ఇవ్వాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ భారతి హోళీ కేరి సూచించారు. జనగణనపై హైదరాబాద్ ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం ఉదయం ఎన్టీఆర్ గార్డెన్ పక్కనున్న అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వరకు వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతి హోళీ కేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సినీ నటి అమల అక్కినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమల జెండా ఊపి వాకథాన్‌ను ప్రారంభించారు. అనంతరం భారతి హోళీ కేరి మాట్లాడుతూ.. దేశంలో 16 ఏండ్ల తర్వాత జనగణన జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్లు వస్తారని, వారికి కచ్చితమైన సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు ఇచ్చే నిజ సమాచారం ఆధారంగానే దేశంలో అభివృద్ధి, సంక్షేమం ఆధారపడి ఉంటుందని తెలిపారు.
జనగణన ప్రజల అభివృద్ధికి ఎంతోగానో ఉపయోగపడుతుందని, కేవలం 10 నిమిషాల సమయం కేటాయించి, అడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు అడగరని, మొబైల్ నంబర్, ఇంటి యజమాని పేరు, ఇతర తప్పనిసరి వివరాలు మాత్రమే అడుగుతారని చెప్పారు. అమల అక్కినేని మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో జనగణన అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఇందులో పాల్గొనాలని కోరారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
