- 10 వేలకుపైగా ప్రపోజల్స్.. నిధుల్లేక పైసా పని చేయలేకపోతున్నామని ఆవేదన
- బడ్జెట్‌లో కేటాయించిన రూ. 800 కోట్ల విడుదలకు ఎదురుచూపులు
- గ్రామాల్లో పనుల కోసం కొత్త సర్పంచుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి
- ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా మోక్షం లభించట్లేదని ఆందోళన
హైదరాబాద్, వెలుగు:నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యేలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోతున్నామని, కొత్త పనులు ప్రారంభించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో సీడీపీ (నియోజక వర్గ అభివృద్ధి కార్యక్రమం) నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోటా కింద సుమారు రూ. 800 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్నా ఈ నిధులు క్షేత్రస్థాయికి చేరలేదని ప్రజాప్రతినిధులు గుర్తుచేస్తున్నారు. 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు మొత్తం159 మంది ప్రజాప్రతినిధుల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని చెప్తున్నారు. బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ, రిలీజ్ ఆర్డర్స్ రాకపోవడంతో కలెక్టర్ల ద్వారా పరిపాలనా అనుమతులు పొందడం కూడా కష్టసాధ్యంగా మారిందని వాపోతున్నారు.
అభివృద్ధి పనులపై ప్రభావం
సీడీపీ నిధులను తమ నియోజకవర్గాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన చిన్నపాటి సివిల్ పనుల కోసం ఎమ్మెల్యేలు వినియోగిస్తుంటారు.సీసీ రోడ్ల నిర్మాణం, మురుగునీటి వ్యవస్థ మెరుగుదల, శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాల మరమ్మతులు ఈ నిధులతోనే పూర్తవుతాయి. వీటితో పాటు వర్షాకాలంలో వచ్చే కల్వర్టుల సమస్యలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి పనులకు ఈ నిధులు ఎంతో కీలకం. ప్రజలకు తక్షణ ఊరటనిచ్చే ఇటువంటి పనులకు నిధులు కేటాయించకపోవడం వల్ల గ్రామాల్లో మౌలికవసతుల సమస్య ఏర్పడుతోంది. గతంలో చేసిన పనులకు సంబంధించిన బకాయిలు కూడా పేరుకుపోవడంతో, సీడీపీ కింద కొత్త పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.
ఎమ్మెల్యేలపై కొత్త సర్పంచుల ఒత్తిడి
క్షేత్రస్థాయిలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులు సైతం తమ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి సీడీపీ పనులే ఏకైక మార్గమని భావిస్తున్న సర్పంచులు, రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కానీ నిధులు లేకపోవడంతో ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం దెబ్బతినకుండా ఉండేందుకు సీడీపీ నిధుల విడుదల అత్యవసరంగా మారిందని, సర్పంచుల ప్రతిపాదనలు ఫైళ్లలోనే మగ్గిపోతున్నాయని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. తాగునీటి పైపులైన్లు, వీధి దీపాలు మొదలుకొని అనేక మౌలిక వసతుల కల్పనకు సీడీపీ, ఎస్‌డీపీ (స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్) నిధులే శరణ్యమని నేతలు పేర్కొంటున్నారు.
హామీల అమలుపై గంపెడాశలు
ఎన్నికల సమయంలో అభ్యర్థులుగా ఉన్న నేతలు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆ హామీలను అమలు చేయాల్సిన సమయం రావడంతో ఎమ్మెల్యేల దగ్గరకు పది వేలకు పైగా ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. సిమెంట్ రోడ్లు, తాగునీటి పైపులైన్లు, వీధి దీపాలు వంటి చిన్నపాటి అవసరాల నుంచి పెద్ద ప్రాజెక్టుల వరకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ డిమాండ్లను నెరవేర్చడానికి సీడీపీ నిధులతో పాటు ఎస్‌డీపీ నిధులు కీలకం కానున్నాయి. పాత హామీలు నెరవేర్చకపోతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని నేతలు ఆందోళన చెందుతున్నారు. కాగా, మున్సిపల్ఎన్నికల నేపథ్యంలోఈ నిధుల విడుదలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన జీవోలు వెలువడతాయని పలువురు ఎమ్మెల్యేలు చెప్తున్నారు.
