- లాయర్లను కలిసేందుకు అనుమతించాలని అధికారులకు ఆర్డర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన లాయర్లు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కలవడానికి అనుమతించాలని అటాక్ జైలు అధికారులను ఇస్లామాబాద్ హైకోర్టు(ఐహెచ్‌సీ) ఆదేశించింది. ఇమ్రాన్ కు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఇమ్రాన్ ను అటాక్ జైలు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించాలని కోరుతూ ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ -ఇ-ఇన్సాఫ్(పీటీఐ) నేతలు ఇటీవల ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
దీన్ని ఐహెచ్‌సీ ప్రధాన న్యాయమూర్తి అమర్ ఫరూక్ శనివారం విచారించారు. ఇమ్రాన్ ఖాన్‌ను అటాక్ జైలులో ఎందుకు ఉంచకూడదో చెప్పాలని ఆయన లాయర్లను కోర్టు ప్రశ్నించింది. జైలులోని ప్రతి ఖైదీకి తన బంధువులను, స్నేహితులను, న్యాయ సలహాదారులను కలుసుకోవడానికి చట్టంలో వెసులు బాటు ఉందని.. కానీ అటాక్ జైలు అధికారులు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని కోర్టుకు ఇమ్రాన్ లాయర్లు వివరించారు. మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ కు సీ-క్లాస్ జైలు సౌకర్యాలు అందిస్తున్నారని తెలిపారు. అటాక్ జైలులో భద్రతా లోపాలున్నాయని.. దానివల్ల ఇమ్రాన్ ప్రాణాపాయం కలగవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వాదనలు విన్న కోర్టు పీటీఐ చీఫ్ కు ఖురాన్ ఆంగ్ల వెర్షన్ కాపీని ఇవ్వాలని, అలాగే ఆయనకు కావాల్సిన వైద్య సదుపాయాలు అందించాలని కోర్టు ఆదేశించింది.