బకాయిదారుల పేర్లు చెప్పాల్సిందే!

బకాయిదారుల పేర్లు చెప్పాల్సిందే!

ఆర్‌ బీఐ కి సీఐసీ ఆదేశం

న్యూఢిల్లీ: భారీగా అప్పులను ఎగవేసిన ఖాతాదారుల (బడా బకాయిదారుల) వివరాలను ఆర్‌ బీఐ సమాచార హక్కు చట్టం కింద వెల్లడించాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) స్పష్టం చేసింది. బడా బకాయిదారుల నుంచి అప్పులను రాబట్టేందుకు బ్యాంకులకు వారి వివరాలతో పంపిన జాబితాను బయటపెట్టాలని స్పష్టం చేసింది. బడా బకాయిదారుల వివరాల కోసం లక్నోకు చెందిన నూతన్‌ ఠాకూర్ ఆర్‌ టీఐ కింద వేసిన పిటిషన్‌ పై విచారణ అనంతరం సీఐసీ పైవిధంగా తీర్పు చెప్పింది. బడా బకాయిదారుల నుంచి అప్పులు వసూలు చేయాలంటూ వారి వివరాలను బ్యాంకులకు పంపామని ఆర్‌ బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరళ్‌ ఆచార్య చేసిన ప్రకటన ఆధారంగా ఆమె ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. మొండి బకాయిలపై ఆర్‌ బీఐ దృష్టి సారించాలని అంతర్గత సలహా సంఘం సిఫార్సు చేసిందని కూడా ఆచార్య వెల్లడించారు.

దీనిపై స్పందించిన ఆర్‌ బీఐ 12 మంది బడా బకాయిదారులకు వ్యతిరేకంగా చర్యలు ప్రారంభించాలని బ్యాంకులను ఆదేశించిం ది. మొత్తం మొండిబకాయిల్లో ఈ 12 మంది వాటాయే 25 శాతం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘2017 డిసెంబరు నాటికి ఈ ఖాతాలను పరిష్కరించాలని బ్యాంకులను ఆదేశించాం . లేకపోతే దివాలా చట్టం ప్రకారం కేసులు వేస్తాం ’’ అని ఆచార్య స్పష్టం చేశారు. డిప్యూటీ గవర్నర్‌ ప్రస్తావించిన బడా బకాయిదారుల జాబితా, నోట్‌ షీట్ల రికార్డులు ఇవ్వాలని ఠాకూర్‌ సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు. ఈ విషయాలను రహస్యంగా ఉంచాలి కాబట్టి వివరాలు ఇవ్వలేమని ఆర్‌ బీఐ ఆమెకు తెలిపింది. దీంతో ఠాకూర్‌ సీఐసీని ఆశ్రయించారు.

విచారణ సందర్భంగా ఆర్‌ బీఐ ప్రతినిధి మాట్లాడుతూ మొండి బకాయిలఖాతాల పరిష్కారం ఇంకా పూర్తి కాలేదని, బడా బకా-యిదారుల జాబితాను ఇంకా ఖరారు చేయలేదని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా బాకీలను ఎగ్గొట్టిన వారితోపాటు ఆర్థిక సమస్యల వల్ల అప్పులు కట్టని వారి పేర్లనూ నోట్‌ షీట్లలో చేర్చామని తెలిపింది. ఆర్థిక సమస్యలతో అప్పులు కట్టని వారి పేర్లను బహిర్గతం చేయడం వారి గోప్యతకు భంగం కలిగించడమేనని వాదించింది. బడా బకాయిదారుల పేర్లను వెల్లడించాల్సిందేనని, అయితే నోట్‌ షీట్లను ఇవ్వాల్సి న అవసరం లేదని సీఐసీ తీర్పు చెప్పింది.