
- జూబ్లీహిల్స్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న ప్రజాపాలనను చూసి ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత మురళీ గౌడ్, మాజీ కార్పొరేటర్ సంజయ్ తోపాటు పలువురు గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇక నుంచి ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ ఉనికే ఉండదన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే రాష్ట్రంలో పాలన సాగుతున్నదని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, కవిత నిత్యం అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, బనకచర్ల విషయంలో హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరిన నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. పార్టీ కోసం పనిచేసే నేతలకే గుర్తింపు ఉంటుందని చెప్పారు.