కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నదని సంతోషపడుతున్నరు: మంత్రి వివేక్
- జూబ్లీహిల్స్ఉప ఎన్నికలో కలిసికట్టుగా పనిచేసి గెలిచినం
- రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌దే విజయం
- కేటీఆర్ ఓ ఫెయిల్యూర్ లీడర్.. పదేండ్లలో బీఆర్ఎస్ ఏ అభివృద్ధి చేయలే
- బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలకు తెలిసిపోయింది
- ఇసుక మాఫియాను అరికట్టినం
- గిగ్ వర్కర్ల సంక్షేమానికి చట్టం తీసుకొస్తున్నం
- త్వరలో అసంఘటిత కార్మికులకు మినిమం వేజెస్ పెంచుతామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజా పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నదని సంతోషపడుతున్నారని చెప్పారు. ఇందుకు ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలే నిదర్శనమని చెప్పారు.
జూబ్లీహిల్స్ బైపోల్‌లో కలిసి కట్టుగా పనిచేస్తేనే 20 వేల పైచిలుకు మెజార్టీ సాధ్యపడిందని తెలిపారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ఫలితాలు రాబోయే ఎన్నికల్లో పార్టీకి ప్లస్ అవుతున్నాయని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలకు తెలిసిపోయిందని, రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా ద్విముఖ పోరే ఉంటుందని, ప్రజలందరూ కాంగ్రెస్‌వైపే ఉంటారని ధీమా వ్యక్తంచేశారు.
శనివారం మంత్రి వివేక్‌వెంకటస్వామి ‘వీ6 వెలుగు’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. వివిధ అంశాలపై తన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..జూబ్లీహిల్స్‌లో 5 నెలలనుంచి గ్రౌండ్ వర్క్ చేసినం
నాకు జూన్‌లో జూబ్లీహిల్స్ బై పోల్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇంటర్నల్ సర్వేలో బీఆర్ఎస్ 22 శాతం ముందున్నదని, ఆ సెగ్మెంట్‌ను మీరు చూసుకుంటారా? అని మీనాక్షి నటరాజన్ నన్ను అడిగినప్పుడు.. కాన్ఫిడెన్స్‌తో ఓకే చెప్పిన. దుబ్బాక, హుజూరాబాద్‌లో పరిస్థితులు బాగాలేనప్పుడు అక్కడ వర్క్చేసిన. అక్కడ నేను సపోర్ట్ చేసినోళ్లు గెలిచిన్రు.
హైదరాబాద్‌లో మా నాన్న కాకా వెంకటస్వామి చేసిన పనులు నాకు అడ్వాంటేజ్ అవుతాయని నమ్మిన. జూబ్లీహిల్స్ లో 12 ఏండ్లు బీఆర్ఎస్సే ఉన్నది. దాన్ని పంక్చర్ చేయాలని డిసైడ్అయిన. రెహమత్ నగర్, బోరబండ, షేక్‌పేటకు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చిన్రు. ఖర్గే మీటింగ్ సమయంలో అక్కడ జనాన్ని ఎవరు ఎక్కువ మొబిలైజ్ చేస్తున్నారో అంచనాకు వచ్చిన. ఎవరు కేపబిలిటీ ఉన్న లీడరో గుర్తించిన. అందరు లీడర్లను ఏకతాటిపైకి తెచ్చిన. ముస్లింలకు కేబినెట్‌లో చోటు దక్కలేదనే ఫీలింగ్ ఉన్నదని గుర్తించి, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌తోపాటు హైకమాండ్ దృష్టికి తీసుకుపోయిన.
అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రివర్గంలోకి తీసుకోవడంతో అక్కడ సీన్ మారిపోయింది. అలాగే, మార్నింగ్ వాక్‌కు వెళ్తూ.. సమస్యలను గుర్తించి.. ఒక్కొక్కటీ పరిష్కరించిన. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పదేండ్లు ఉన్నా జూబ్లీహిల్స్‌లో పరిష్కారం కాని నాలా సమస్యకు సొల్యూషన్ చూపించినం. దీంతో ప్రజల్లో ఆదరణ పెరిగింది. కేడర్‌లో జోష్ వచ్చింది. 20 వేల పైచిలుకు మెజార్టీతో జూబ్లీహిల్స్‌లో గెలిచినం.
కేటీఆర్‌ను బీఆర్ఎస్ కేడరే నమ్మట్లేదు..
కేటీఆర్ ఓ ఫెయిల్యూర్ లీడర్. ఇది నేను ముందునుంచి చెప్తున్నా.. 2019 ఎన్నికల్లో కేసీఆర్ ఫొటో ఒకవైపు.. కేటీఆర్ ఫొటో ఒకవైపు పెట్టుకున్నరు. కేసీఆర్ బయటకు రాలే. కేటీఆర్వర్కింగ్ ప్రెసిడెంట్‌గా క్యాంపెయిన్ నడిపిండు. ‘సారు.. కారు.. పదహారు..’ అన్నరు. 7 సీట్లు ఓడిపోయిన్రు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అని కేటీఆర్ అన్నడు. కానీ బీఆర్ఎస్ పార్టే ఓడిపోయింది. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో జీరో సీట్లే వచ్చినయ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్‌నే పెట్టలే.
పదేండ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేసిండు.. కానీ ఆయనకు గ్రౌండ్ రియాలిటీ తెల్వదు. కేవలం సొంత సర్వేలు చేయించుకొని హీరోలాగా ఫీలైతడు.. ఎన్నికల్లో ఎంటర్టైన్మెంట్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తడు. జూబ్లీహిల్స్‌లో ఓటమి తర్వాత కేటీఆర్‌ను ఆయన సొంత కేడరే నమ్మడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటీఆర్నాయకత్వాన్ని కార్యకర్తలు విశ్వసించడంలేదు.
బై ఎలక్షన్స్ పార్టీకి ప్లస్
ప్రతి ఎలక్షన్‌లోనూ బీఆర్ఎస్ జిమ్మిక్కులు చేసింది. ఇది పబ్లిక్కు తెలిసిపోయింది. కాళేశ్వరం, మిషన్‌భగీరథ, ఇసుక స్కామ్, భూకబ్జాల్లో బీఆర్ఎస్ నేతలున్నరు. అందుకే మార్పుకోసం ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించిన్రు. ఇప్పటికీ బీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మడంలేదు. పదేండ్లలో వారి కుటుంబ ఆస్తులు పెంచుకున్నారు తప్పా.. తమకేమీ చేయలేదని ప్రజలు భావిస్తున్నరు. కేసీఆర్ కూతురు కవితకూడా ఇదే విషయం చెప్తున్నరు. అందుకే వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో కాంగ్రెస్‌కు ఆదరణ పెరగబోతున్నది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ విజయం మాకు ప్లస్ కాబోతున్నది.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని నేను ముందునుంచీ చెప్తున్నా.. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పడాల్సి న ఓట్లన్నీ బీజేపీకి పడ్డయ్.. అందుకే ఆ పార్టీ 8 సీట్లు గెలిచింది. అందుకే ఈసారి జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌కు బీజేపీ సపోర్ట్ చేసింది. వారి డిపాజిట్ కోల్పోయి కూడా..బీఆర్ఎస్‌కు ఓట్లు మళ్లించిన్రు. రాష్ట్రంలో మీరై నా ఉండాలి.. లేదా మేమైనా ఉండాలి.. అనే అవగాహ నతో ముందుకు పోతున్నరు. అందుకే రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా పోటీ బైపోలార్గానే ఉంటుంది.
త్రిము ఖ పోరుకు అవకాశమే లేదు. ప్రజలందరూ అభివృద్ధి, సంక్షేమం చూసి.. కాంగ్రెస్‌వైపే ఉంటున్నరు. అదే నమ్మకాన్ని కాపాడుకుంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికే కాదు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు గెలుస్తం. తెలం గాణ ప్రజలకు అహంకారం నచ్చదు. అట్లా ఉంటే ఓడిస్తరు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ 8 లక్షల కోట్ల అప్పుల్లో ముం చింది. ఖజానా ఖాళీ చేసింది. వారి సొంత ఆస్తులను మాత్రం పెంచుకున్నరు. అందుకే బీఆర్ఎస్పై ప్రజలకు తీవ్ర అసంతృప్తి ఉన్నది.
గిగ్ వర్కర్లకు న్యాయం చేస్తం..
గిగ్ వర్కర్స్‌కి మొదట్లో బాగానే ఉండేది. కానీ.. ఇప్పుడు మార్జిన్ తక్కువైపోయింది. అగ్రిగేటర్లు వారిని ఇబ్బందిపెడుతున్నరు. దీన్ని భారత్ జోడోయాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గమనించారు. గిగ్ వర్కర్లకు అండగా నిలవాలని చెప్పారు. అందుకే గిగ్ వర్కర్స్ బిల్లు తీసుకొస్తున్నాం. సెస్ కలెక్ట్ చేసి.. వెల్ఫేర్ ఫండ్ క్రియేట్ చేస్తున్నం. ప్రతి గిగ్ వర్కర్ ప్రభుత్వం వద్ద పేరు నమోదు చేసుకోవాలి. లేదా అగ్రిగేటర్లు తమ వద్ద పనిచేస్తున్న వర్కర్ల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక గిగ్ వర్కర్లను ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యోగంలోనుంచి తీసేయడం ఉండదు. అలాగే, రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులకు మినిమం వేజెస్ పెంచే ఆలోచనలో ఉన్నం. దీనిపై కేబినెట్‌లో కూడా చర్చించినం. త్వరలోనే మినిమం వేజెస్‌ను చేంజ్చేస్తం. దీంతో కోటి 70 లక్షల మంది లేబర్స్‌కు ప్రయోజనం చేకూరుతుంది.
సింగరేణి కార్మికుల వేతనాలు కూడా పెరుగుతయ్. టామ్‌కామ్‌తో నిరుద్యోగులకు విదేశాల్లో అవకాశాలు కల్పిస్తున్నం. జర్మన్‌లాంటి భాషలు నేర్పించిమరీ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నం. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మార్చినం. 80% లోకల్వాళ్లనే అసంఘటిత కార్మికులుగా తీసుకోవాలని నిర్ణయించినం.
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం..
బీఆర్ఎస్ హయాంలో చెన్నూర్‌లో ఇసుక మాఫియా నడిచింది. దీన్ని అరికడతానని ఎన్నికల సమయంలో నేను ప్రజలకు హామీ ఇచ్చిన. గెలవగానే ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపినం. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘాపెట్టినం. చెన్నూరులో చేసినట్టే రాష్ట్రవ్యాప్తంగా చేయాలని సీఎం రేవంత్ టార్గెట్ పెట్టారు.
మా మినరల్ డెవలప్మెంట్కార్పొరేషన్టీం బాగుంది. కలిసి పనిచేస్తున్నం. ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా ఇసుక ఇస్తున్నం. చెన్నూరులో శాండ్ బజార్ ఏర్పాటు చేసినం. ఇసుక రేటును తగ్గించాలని ప్రజలు కోరిన్రు. ఆ ప్రయత్నం చేస్తున్నం. నేనెప్పుడూ రూల్ ప్రకారమే నడుచుకోమని చెప్తున్న. సిగాచి ప్రమాదంలో బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తున్నం. రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్‌లో క్రిటికల్ ఏరియాస్‌లో ఎక్స్పర్ట్ మాత్రమే పనిచేసేలా ఓ చట్టం తీసుకురావాలని భావిస్తున్నం.
బీఆర్ఎస్‌కు కంటెంట్ లేదు.. హైప్‌నే నమ్ముకున్నది.
ఇప్పుడంతా సోషల్ మీడియాదే నడుస్తున్నది. అందరూ సోషల్ మీడియానే ఫాలో అవుతున్నరు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను డెవలప్ చేయాలని నేను ఏడాదినుంచి చెప్తున్నా. ప్రజలు తప్పా.. ఒప్పా.. చూడట్లేదు.. ఏది హైప్‌గా ఉంటుందో అది చూస్తున్నరు. కానీ, బీఆర్ఎస్‌కు కంటెంట్ లేదు. సోషల్ మీడియాలో ఎంత హైప్ చేసినా ప్రయోజనం దక్కలే. ఎందుకంటే పదేండ్లలో వారు చేసిందేమీలేదు. ప్రజలే వారిని ఏం చేసిర్రని ప్రశ్నించిన్రు.
ఒకవేళ వారు పదేండ్లలో ఏమైనా చేసి ఉంటే వారే గెలిచేవారు కదా? ఇప్పటికీ బీఆర్ఎస్ ఓడిపోతే ప్రజలదే తప్పని కేటీఆర్ అంటున్నారు. తామేమీ తప్పుచేయలేదనే మాట్లాడుతున్నరు. ప్రజలే మారాలని అంటున్నరు. ఇన్ని ఎలక్షన్లు ఓడిపోయినా.. కేటీఆర్‌లో మార్పు రావట్లే. పార్టీని సరిదిద్దుకోవాలనే ఆలోచనే చేయట్లే. జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, లీడర్లు, బయటినుంచి కేడర్‌ను తీసుకొచ్చి.. పెద్ద మొత్తంలో మద్దతు ఉన్నట్టు నమ్మించిన్రు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరులో కూడా ఇలాగే బయటనుంచి కేడర్‌ను తీసుకొచ్చి ప్రచారం చేసిన్రు. సోషల్ మీడియాను హైప్ చేస్తే గెలుస్తామనే భ్రమల్లో కేటీఆర్ ఉన్నడు. ఇట్లనే విమర్శలు చేస్తుంటే.. ఇక కేటీఆర్ ఎన్నటికీ గెల్వడు.
పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా చిత్తశుద్ధితో పనిచేస్త
మెదక్ ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకొమ్మని రేవంత్‌రెడ్డి చెప్పారు. అక్కడ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అక్కడ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు సిద్దిపేటలో స్థానిక ఎన్నికల్లో మాకు టికెట్స్ కావాలని పోటీపడుతున్నరు. రాష్ట్ర ప్రభుత్వంపై హరీశ్‌రావు పదేపదే విమర్శలు చేస్తున్నరు. ఆయనకు ప్రతి మీటింగ్‌లో కౌంటర్ ఇస్తున్న. ఇది మంచి చాలెంజింగ్గాఅనిపిస్తున్నది. మెదక్‌లో కాంగ్రెస్ బలపడుతున్నది.
