టోక్యోలో వచ్చే నెల ప్రారంభం కానున్న ఒలింపిక్ గేమ్స్ కోసం సన్నద్ధమవుతున్న భారత క్రీడాకారులందరిలోనూ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తోంది. స్వీయ సామర్థ్యంపై వారి విశ్వాసం, దేశంలోని ప్రముఖ క్రీడాకారుల్లో ఉద్విగ్నతను మనం చూడబోతున్నాం. కరోనా పరిస్థితులు, సవాళ్లు ఉన్నప్పటికీ క్రీడాకారులు ప్రదర్శిస్తున్న సంసిద్ధత స్థాయి వారిలో పెరుగుతున్న విశ్వాసానికి కారణం. ఈ భరోసా ఎక్కడ నుంచి ఉద్భవిస్తున్నదో చూడటానికి ఇక ఎక్కువ సమయం పట్టబోదు. ప్రత్యేక పరిస్థితుల కారణంగా దాదాపు ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో-2020 ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే మన 125 మందికిపైగా క్రీడాకారుల్లో ప్రతి ఒక్కరూ అత్యుత్తమ శారీరక, మానసిక దృఢత్వంతో, పోటీ స్ఫూర్తితో కొనసాగడానికి చేయని ప్రయత్నమంటూ లేదు.
క్రీడాకారులకు అవసరమైన మద్దతు దక్కింది
ఒలింపిక్స్‌కు అర్హత పొందే అవకాశం లభించిన మన బ్యాడ్మింటన్ క్రీడాకారులందరికీ అవసరమైన మద్దతు లభించిందని చెప్పడం సముచితమని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. తదనుగుణంగా అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ నేడు విదేశీ శిక్షకులు, ఫిజియోథెరపిస్టుల ద్వారా శిక్షణ, తోడ్పాటు లభిస్తోంది. వీరితోపాటు శరీరదారుఢ్య నిర్వహణ శిక్షకులు కూడా వారికి అందుబాటులో ఉన్నారు. ఇప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇటువంటి వ్యక్తిగత శ్రద్ధ మునుపటి రోజుల్లో అరుదు. అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండటం అవసరం.
వెన్నుదన్నుగా నిలిచిన ప్రధాని
2019 నాటి రియో ఒలింపిక్స్ క్రీడల నాటి పరిస్థితులు నేడు నాకు గుర్తుకొస్తున్నాయి. ఆనాడు భారత క్రీడాకారులు ఆశించిన ఫలితాలు సాధించకపోయినా, ప్రధానమంత్రి వారికి వెన్నుదన్నుగా నిలిచి, ఈసారి నూటికి నూరుశాతం ప్రతిభా పాటవాలను ప్రదర్శించాల్సిందిగా ప్రోత్సహించారు. ఇందులో భాగంగా రియో క్రీడల ఫలితాల నేపథ్యంలో ఒలింపిక్ టాస్క్ ఫోర్స్‌ను ఆయన ఏర్పాటు చేశారు. దీంతో భారత క్రీడారంగంలో పెల్లుబికిన మార్పు నాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మేరకు అత్యున్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి దాకా ఒక సానుకూల వాతావరణం కల్పించడంలో అత్యంత శ్రద్ధ పూర్తిగా ద్యోతకమైంది. అలాగే దేశ క్రీడారంగంలో వృత్తిగత క్రీడా పర్యావరణం ఏర్పడింది.
టోక్యోలో సత్ఫలితాలు వస్తాయి
ఈ స్ఫూర్తిదాయక తోడ్పాటు ద్వారా టోక్యో-2020 ఒలింపిక్ క్రీడల్లో సత్ఫలితాలు సాధిస్తామని నేను విశ్వసిస్తున్నాను. మన క్రీడాకారులపై మనం ఎంతో నమ్మకముంచి, వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించినందున ఇదొక మేలిమలుపు కాగలదని భావిస్తున్నాను. తద్వారా ఒనగూడే సానుకూల ఫలితాలు దేశంలో ప్రతిభగల క్రీడాకారుల ఆవిర్భావానికి దారితీసి, భారత క్రీడా పతాకను వారు ప్రపంచంలో సమున్నతంగా ఎగురవేయాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రస్తుత కరోనా మహమ్మారి వేళ విషాదం నిండిన దేశవాసుల హృదయాల్లో ఆనందోత్సాహాలు నింపడానికి మన క్రీడాకారులకు లభించిన ఓ అవకాశంగా దీన్ని నేను పరిగణిస్తున్నాను.
అన్ని విధాలుగా ప్రోత్సాహం
మన దేశం ‘క్రీడాకారులకు అగ్రాసనం’ వేసింది. దీనికి తగినట్లుగా సాయ్ వారి అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యమిచ్చింది. ప్రతి ఒక్కరూ అత్యవసర పరిస్థితి తరహాలో, ఏకాభిప్రాయంతో క్రీడాకారులకు తోడ్పాటునిచ్చే లక్ష్యంతో కృషి చేసేలా శ్రద్ధ వహించింది. దీంతో ప్రణాళిక-కార్యాచరణ మధ్య వ్యవధి తగ్గిపోయింది. ఫలితంగా క్రీడాకారులు ప్రపంచంలోనే భారీ క్రీడా సంబరంలో తమ ప్రతిభ చాటేందుకు సన్నద్ధం కాగలిగారు. జాతీయ క్రీడా సమాఖ్యలు, భారత ఒలింపిక్ అసోసియేషన్‌తో కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల శాఖ సమన్వయంతో కృషి చేస్తూ శిక్షకుల కాంట్రాక్టుల పొడిగింపును సుసాధ్యం చేసింది. సురక్షిత, భద్రమైన రీతిలో దేశంలోని వివిధ నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో జాతీయ శిక్షణ శిబిరాల పునఃప్రారంభానికి మార్గం సుగమం చేసింది.
- పుల్లెల గోపీచంద్, ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్ చీఫ్ కోచ్
