Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2027) సీజన్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు కోచింగ్ విభాగంలో భారీ ప్రక్షాళన జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ నేతృత్వంలోని పంజాబ్ కోచింగ్ స్టాఫ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
రాజీనామా చేసిన బ్రాడ్ హాడిన్, జేమ్స్ హోప్స్:
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. పంజాబ్ కింగ్స్ జట్టుకు చెందిన కోచ్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటికే సాయిరాజ్ బాహుతులే వైదొలగగా.. తాజాగా జట్టు ఫీల్డింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ (Brad Haddin), ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ (James Hopes) కూడా తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన బిగ్ బాష్ లీగ్ (BBL)లో కొత్త ఉద్యోగాలు పొందడమే వీరు పంజాబ్ జట్టును వీడడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
కొత్త కోచ్‌ల వేటలో రికీ పాంటింగ్:
హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆధ్వర్యంలో పని చేస్తున్న కోచింగ్ స్టాఫ్‌లో ఈ మార్పుల కారణంగా, కొత్త ముఖాలను వెతికే బాధ్యతను పాంటింగ్‌పైనే ఉంచారు. ఐపీఎల్ 2027 వేలానికి ముందే పంజాబ్ మేనేజ్‌మెంట్ కొత్త కోచింగ్ బృందాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ కొత్త కూర్పు జట్టును ఏ విధంగా ముందుకు నడిపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
పంజాబ్ కింగ్స్ భవిష్యత్తు ప్రణాళికలు:
గత కొన్ని సీజన్లుగా పంజాబ్ కింగ్స్ నిలకడైన ప్రదర్శన కనబరుస్తోంది. శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్ ఆటగాడి చేరికతో జట్టు మరింత బలపడింది. 2025 సీజన్‌లో అద్భుత ఆటతీరుతో ఫైనల్‌కు దూసుకెళ్లిన పంజాబ్.. తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. అయితే 2026 సీజన్ మాత్రం ఆశించిన స్థాయిలో కొనసాగలేదు. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టినా, ఆ తర్వాత వరుస ఓటములతో ఐదో స్థానంతో సరిపెట్టుకుని ప్లేఆఫ్స్ అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. ఇప్పుడు కొత్త కోచింగ్ స్టాఫ్‌తో రాబోయే సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాల్సి ఉంది.
