విశ్వాసం..ఏకాగ్రత ఉన్నవారికే విద్య బోధించాలి : పురాణపండ వైజయంతి

విశ్వాసం..ఏకాగ్రత ఉన్నవారికే విద్య బోధించాలి : పురాణపండ వైజయంతి

నిత్యజీవితంలో ఏకాగ్రత, ఏకసంథాగ్రాహి, కుశాగ్రబుద్ధి అనే పదాల గురించి తరచుగా వింటుంటాం. ఈ పదాలన్నీ ఇంచుమించు ఒకే భావాన్ని ఇస్తున్నప్పటికీ  వేటి అర్థం వాటిది. ఈ లక్షణాలున్న శిష్యుల మీద గురువులకు మమకారం మెండుగా ఉంటుంది. తన తరువాత తనంతటి వారుగా ఎదిగేలా తీర్చిదిద్దుతారు గురువులు. ఇందుకు మంచి ఉదాహరణగా కనిపిస్తారు ద్రోణాచార్యుడు – అర్జునుడు.

మహాభారతంలో కౌరవులు, పాండవులకు విద్య నేర్పడం కోసం ద్రోణాచార్యుడిని నియోగించాడు భీష్ముడు. ఎవరికి ఏ విద్యలో ఆసక్తి ఉందో, ఎవరికి ఎంతవరకు శ్రద్ధ ఉందో ముందుగా గమనించాలనుకున్నాడు. ఒక్కొక్కరినీ పిలిచి, ‘ఆ చెట్టు మీద ఏం కనపడుతోంది?’ అని ప్రశ్నించాడు. అందుకు, ‘‘ఆ చెట్టు మీద ఒక కొమ్మ, ఆ కొమ్మ మీద ఒక పక్షి కనిపిస్తున్నాయి’’, ‘‘ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు మీద ఒక పెద్ద కొమ్మ, ఆ పెద్ద కొమ్మ మీద ఒక పెద్ద పక్షి కూర్చుంది’’ అంటూ అందరూ రకరకాలుగా సమాధానమిస్తున్నారు.

వారిచ్చే సమాధానాలు ద్రోణాచార్యుడికి సంతృప్తిని ఇవ్వట్లేదు. ఆ వరుస క్రమంలో అర్జునుని పిలిచి, ‘నాయనా! నీకు ఏం కనిపిస్తోంది?’ అని అడిగాడు ద్రోణుడు. వెంటనే అర్జునుడు ఒక నిమిషం సమయం తీసుకుని, ‘‘గురువర్యా, నాకు పక్షి కంటి గుడ్డు మాత్రమే కనిపిస్తోంది’’ అన్నాడు ఏకాగ్ర చిత్తంతో. ద్రోణాచార్యుడు ఆనందపరవశుడయ్యాడు. మరో రెండు సార్లు ప్రశ్నించాడు, ‘నీకు ఇంకేమీ కనపడట్లేదా’ అని. ‘కంటి గుడ్డు మాత్రమే కనిపిస్తోంది’ అని మళ్లీ మళ్లీ చెప్పాడు. ఇన్నాళ్లుగా నేను వెతుకుతున్న శిష్యుడు ఇప్పటికి నాకు దొరికాడు. వీడే నాకు తగిన శిష్యుడు. ఈ అర్జునుని మించిన యోధుడు ప్రపంచంలోనే లేడు’ అనిపించేలా శిక్షణ ఇస్తాను అనుకున్నాడు ద్రోణుడు. అర్జునునికి సకల విద్యలు ఎంతో దీక్షగా నేర్పించి, ‘సాటిలేని మేటి యోధుడు అర్జునుడు’ అని వీరులందరూ కొనియాడేలా తీర్చిదిద్దాడు. 

ఇక ఏకలవ్యుడి విషయానికి వస్తే...

గురువు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని, ఆయన నేర్పుతున్న భావనతోనే స్వయంగా విద్యను నేర్చుకున్నాడు. అయితే ఏ బాణాన్ని ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలా అనే విచక్ష ణ తెలియనివాడు. తనకు తోచిన విధంగా బాణాలను ఎక్కడపడితే అక్కడ వేసేస్తుంటాడు. ఒకసారి ఒక కుక్క పరుగెడుతుంటే దాని నోట్లోకి ఏడు బాణాలు సంధించాడు. వాస్తవానికి ఆ కుక్క ఎవరికీ ఎటువంటి హానీ చేయలేదు. తన విద్యను ప్రదర్శించాలనే ఏకైక లక్ష్యంతో ఆ విధంగా చేశాడు ఏకలవ్యుడు. ఏ విద్యనయినా లోక కల్యాణం కోసం ఉపయోగించాలే కాని, వినాశనానికి ఉపయోగించకూడదు. అందుకే ద్రోణుడు ఏకలవ్యుడి వల్ల ఉపకారం కంటే, అపకారమే ఎక్కువ కలుగుతుందని భావించి, బొటన వేలిని దక్షిణగా కోరాడు. 

కొడుకుకే కొన్ని విద్యలు నేర్పలేదు

తన కుమారుడైన అశ్వత్థామ ఆవేశపరుడని, ముందువెనుకలు ఆలోచించకుండా తొందరపాటుతో శరసంధానం చేస్తాడని తెలిసిన ద్రోణుడు, కొన్ని అస్త్రాలను అశ్వత్థామకు బోధించలేదు. ఒక అస్త్రాన్ని ఉపయోగింటానికి ముందుగానే, ఆ అస్త్రాన్ని ఉపయోగించటం వలన కలిగే ఫలితాలను గురించి ఆలోచించాలి. ఏ ఆలోచనా లేకుండా తొందరపాటుగా శరసంధానం చేస్తే, దుష్పరిణామాలు, దుష్ఫలితాలు వస్తాయి. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక, దుర్యోధనుడి మెప్పు కోసం, సౌప్తిక ప్రళయం సృష్టించాడు అశ్వత్థామ. నిద్రిస్తున్న ఉపపాండవులను కర్కశంగా సంహరించాడు. అశ్వత్థామ సంగతి తెలుసు కనుకనే, తన కుమారుడైనప్పటికీ అన్ని విద్యలు బోధించలేదు ద్రోణుడు.

అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది. ఆ అస్త్రంతో మొత్తం సైన్యాన్ని ఒక్కరోజులో అంతం చేయగలడు అర్జునుడు. కాని దాని వల్ల శత్రువులు మాత్రమే కాక, అమాయకులు సైతం హతమవుతారని తెలుసు. అందుకే ఆ అస్త్రాన్ని ఉపయోగించనని అన్నగారికి చెబుతాడు. అర్జునుడు ఏ అస్త్రాన్ని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో తెలిసినవాడు. ఒకవేళ తొందరపాటు నిర్ణయం తీసుకోబోతున్నా, ధర్మరాజు వారిస్తాడు. అందువల్లే పాండవుల వల్ల సామాన్యులకు ఎన్నడూ అపకారం జరగలేదు.


నిజమైన గురువు తన విద్యార్థిలోని ఏకాగ్రతను బట్టి, వారి ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఏ విద్యను ఏ విధంగా ఉపయోగించుకుంటాడు అని అర్థం చేసుకుంటాడు. అందుకే ద్రోణుడు వంటి బాధ్యత గల గురువు ఎవరికి ఏ విద్య ఎంతవరకు నేర్పాలో అంతవరకే నేర్పాడు. అర్జునునికి మాత్రమే అన్నీ నేర్పాడు. 

- డా. పురాణపండ వైజయంతి
80085 51232