మరోసారి సరిహద్దులు దాటిన ప్రేమకథ.. లవర్ కోసం పాక్ నుంచి ఇండియాకు

మరోసారి సరిహద్దులు దాటిన ప్రేమకథ.. లవర్ కోసం పాక్ నుంచి ఇండియాకు

పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన జవేరియా ఖనుమ్ అనే మహిళ కోల్‌కతా నివాసి సమీర్ ఖాన్‌ను వివాహం చేసుకోవడానికి డిసెంబర్ 5న భారతదేశానికి వచ్చింది. 21 ఏళ్ల ఈ మహిళకు భారత ప్రభుత్వం 45 రోజుల వీసా మంజూరు చేసింది. ఆమె వాఘా సరిహద్దు గుండా భారతదేశంలోకి ప్రవేశించింది. ఆమెకు కాబోయే భర్త సమీర్, కాబోయే మామ అహ్మద్ కమల్ ఖాన్ యూసఫ్‌జాయ్ 'ధోల్' దరువులతో స్వాగతం పలికారు.

కొవిడ్ మహమ్మారి వారి ప్రణాళికలను ఐదేళ్లపాటు నిలిపివేసింది. ఆమె వీసా అంతకుముందు రెండుసార్లు రిజెక్ట్ అయింది. ఈ క్రమంలో జవేరియా ఇండియా వచ్చిన తర్వాత ఈ జంట మీడియాతో ముచ్చటించారు. భారత ప్రభుత్వానికి వారి సహకారానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని, ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉన్నప్పుడు సరిహద్దులతో పట్టింపు అవసరం లేదని సమీర్ అన్నారు.

వచ్చే ఏడాది జనవరిలో సమీర్, జవేరియా వివాహం జరగనుంది. ఆ తర్వాత ఆమె దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకోనుంది. తనకు 45 రోజుల వీసా మంజూరు చేశారని..  ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నానని జవేరియా చెప్పింది. జనవరి మొదటి వారంలో తమ వివాహం వైభవంగా జరుగుతుందని తెలిపింది. ఇది సంతోషకరమైన ముగింపు, సంతోషకరమైన ప్రారంభం అని ఆమె చెప్పింది.  

మక్బూల్ అహ్మద్ వాసీ ఖాదియన్, జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త. జవేరియా భారతదేశానికి రావడానికి వీసాను పొందడంలో అతను చాలా సహాయం చేశాడు. వీసాలు పొందడంలో అతను చాలా మంది పాకిస్థానీ వధువులకు సహాయం చేశాడు. జవేరియాతో తన సంబంధం గురించి సమీర్ మాట్లాడుతూ, తమ పరిచయం మే 2018లో ప్రారంభమైందని చెప్పాడు. ఆఫ్రికా, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్, ఇతర దేశాల నుండి కొందరు స్నేహితులు కూడా సమీర్, జవేరియాల వివాహానికి హాజరయ్యే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.