
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. సినిమాకు సంబంధించిన సాంగ్స్, డైలాగ్స్ ప్రపంచ వ్యాప్తంగా మోత మోగించాయి. బన్నీ చెప్పిన ‘తగ్గేదే లే’ డైలాగ్ ఎంతో పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. సినీ, రాజకీయ ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు ఈ డైలాగ్స్ చెబుతూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టులు చేశారు. విదేశాల్లో ఉన్న వారు సైతం..ఈ డైలాగ్ కు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో ‘అల్లు అర్జున్’ పోషించిన పాత్రను కొందరు అనుకరిస్తూ...తమ హావభావాలతో ప్రేమను చాటుకున్నారు.
ఇటీవల వినాయక చవితి పండుగ సందర్భంగా ‘తగ్గేదే లే’ సిగ్నేచర్ స్టైల్‌ను ఇమిటేట్ చేస్తూ ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం అందరినీ ఆకట్టుకొంది. ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా ‘అల్లు అర్జున్’ పోస్టర్లతో కూడిన పటాసులు ముంబై మార్కెట్ లో దర్శనమిస్తున్నాయి. చాలా దుకాణాల్లో ‘పుష్ప అనార్’ పేరిట బాణసంచాను విక్రయిస్తున్నారు. వీటిని కొనుక్కోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ ది రైజ్ సినిమా డిసెంబర్ 2021లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా సీక్వెల్ రూపొందుతోంది.