
- ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడిన రష్యా అధ్యక్షుడు
- యుద్ధం ముగింపుపై చర్చ
- జపరోజియా, ఖేర్సన్ ఉక్రెయిన్‌కు అప్పగింతకు పుతిన్ సంసిద్ధత
- డొనెట్స్క్ ఇవ్వబోమన్న జెలెన్స్కీ
మాస్కో: ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ప్రాంతాన్ని తమకు అప్పగిస్తే యుద్ధాన్ని ముగిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. డొనెట్స్క్ కోసం ఎంతవరకైనా వెళ్తామని హెచ్చరించారు. స్వతహాగా అప్పగిస్తే అందరికీ మంచిదని, లేకపోతే రష్యా సేనలే స్వాధీనం చేసుకుంటాయని తేల్చిచెప్పారు. కాగా, డొనెట్స్క్ ప్రాంతాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకోవడానికి దాదాపు 11 ఏండ్లుగా వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. రష్యా డిమాండ్లను ట్రంప్‌కు పుతిన్ వివరించారు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ విషయాన్ని వైట్‌హౌస్ అధికారులు వాషింగ్టన్ పోస్ట్ కు తెలియజేశారు. యుద్ధాన్ని ముగించడం, డొనెట్స్క్పై ప్రధానంగా చర్చించారు. ‘‘డొనెట్స్క్ లోని 75% భూమి మా ఆధీనంలోనే ఉంది. స్లోవియాన్స్క్, క్రమటార్స్క్ సిటీలు మాత్రమే ఉక్రెయిన్ చేతిలో ఉన్నాయి. వెంటనే ఈ రెండు సిటీలను మాకు అప్పగించాలి. ఇక్కడ రష్యన్లే ఎక్కువగా ఉంటారు. డొనెట్స్క్ ప్రాంతం మొత్తం మా ఆధీనంలోకి వచ్చిన వెంటనే యుద్ధాన్ని ముగించేందుకు చర్యలు తీసుకుంటాం. మా స్వాధీనంలో ఉన్న జపరోజియా, ఖేర్సన్ను తిరిగిచ్చేస్తాం’’అని ట్రంప్‌కు ఫోన్లో పుతిన్ వివరించారు. అయితే, త్వరలో హంగేరిలో పుతిన్‌తో ట్రంప్ భేటీ కానున్నారు. యుద్ధానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పుతిన్‌తో ఫోన్ కాల్ తర్వాత అదేరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఉబోస్‌లో ట్రంప్ భేటీ అయ్యారు. పుతిన్ ప్రపోజల్‌ను జెలెన్స్కీకు వివరించారు. అయితే.. అతను డొనెట్స్క్ను అప్పగించేందుకు నిరాకరించినట్లు సమాచారం.
రష్యాలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఓరెన్‌బర్గ్‌లోని అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. కజఖ్ బార్డర్లో ఈ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది. ఇక్కడ ఏడాదికి 45 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ప్రాసెసింగ్ అవుతుంది. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లలో ఇదీ ఒకటి. ఉక్రెయిన్ డ్రోన్ దాడితో ప్లాంట్‌లోని వర్క్ షాప్ డ్యామేజ్ అయిందని రీజినల్ గవర్నర్ యెవ్జెనీ సోల్ంట్సేవ్ తెలిపారు. సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేశారన్నారు. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని వివరించారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఉక్రెయిన్ ప్రయోగించిన 45 డ్రోన్లను కూల్చేశామ ని రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటించింది.