
కృష్ణా నదిలో పుట్టి మునిగిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పస్పల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిని దాటే క్రమంలో ఈ ఘోరం జరిగింది. నారాయణపేట జిల్లా పస్పల గ్రామం నుంచి సుమారు 15 మంది కూలీలు పుట్టిల్లో కర్ణాటక రాష్ట్రంలోని కురవాపురం గ్రామానికి బయల్దేరారు. నిత్యావసర సరకుల కోసం పంచదేవ్ పాడుకు వచ్చి నదిని దాటే క్రమంలో పుట్టి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగింది. వెంటనే మరో పుట్టిలోని ప్రయాణికులు అప్రమత్తమై నీటిలో మునిగిన కొంతమందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 11 మందిని కాపాడారు. గల్లంతైన వారిలో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.