
- జూన్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించనున్న ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్
ముంబై: ఈ వారం ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ వంటి పెద్ద కంపెనీలు తమ జూన్ క్వార్టర్ రిజల్ట్స్‌ను ప్రకటించనున్నాయి. మార్కెట్ డైరెక్షన్‌ను ఇవి నిర్ణయించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇండియా, -యూఎస్ ట్రేడ్ డీల్ అప్‌డేట్స్, గ్లోబల్ అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాలపై సోమవారం మార్కెట్ స్పందించనుంది.
భారత్, యూఎస్ ట్రేడ్ ఒప్పందం వచ్చే నెల 1 లోపు కుదిరే అవకాశం కనిపిస్తోంది. విదేశీ ఇన్వెస్టర్ల కదలికలను, రూపాయి ట్రెండ్‌ను ట్రేడర్లు జాగ్రత్తగా గమనించాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతపై అనిశ్చితి, క్రూడ్ ఆయిల్ ధరలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని అంచనా. గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 0.90శాతం, నిఫ్టీ 0.72శాతం నష్టపోయాయి.
రూ.5,524 కోట్ల షేర్లు అమ్మిన ఎఫ్‌పీఐలు
ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్‌పీఐలు) ఈ నెలలో ఇప్పటివరకు నికరంగా రూ.5,524 కోట్లను మార్కెట్ నుంచి విత్‌డ్రా చేసుకున్నారు. యూఎస్, ఇండియా ట్రేడ్ డీల్‌పై అనిశ్చితి, మిశ్రమ కార్పొరేట్ ఫలితాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా మారారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం రూ.83,245 కోట్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు.